మట్టిని లూటీ చేస్తున్న అక్రమార్కులు

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లాలో అక్రమ మొరం తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మట్టిని లూటీ చేస్తున్న అక్రమార్కులు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో అక్రమ మొరం తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకుని పగలు, రాత్రి తేడా లేకుండా మొరం తవ్వి జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెబుతున్నారు. ఈ అక్రమ దందా ఏడాదికిపైగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.

30 అడుగుల లోతు వరకు తవ్వకాలు..

కామారెడ్డి మండలం శాబ్దిపూర్ శివారులోని సర్వే నంబర్ 41/77లో ఉన్న ప్రభుత్వ భూమిలో యంత్రాలతో సుమారు 30 అడుగుల లోతు వరకు మొరం తవ్వుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో భూమి భారీ గోతులుగా మారి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాప్రతినిధుల పాత్రపై ఆరోపణలు..

శాబ్దిపూర్ సమీప గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా తవ్విన మొరాన్ని కామారెడ్డి పట్టణం, శివారు ప్రాంతాల్లో విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని పేర్కొంటున్నారు. మరో వ్యక్తి కూడా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

అధికారులపై నిర్లక్ష్య ఆరోపణలు..

అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని బెదిరిస్తున్నారని, స్థానికులు పట్టుకుని అధికారులకు అప్పగించిన వాహనాలను కొద్దిసేపటికే విడిచిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల తీరుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి నష్టం..

ప్రభుత్వ అనుమతులు లేకుండా మొరం తవ్వి విక్రయించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ, ఇతర ఆదాయాలు కోల్పోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అక్రమంగా తరలించే ప్రతి టిప్పర్ ద్వారా వేల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదని ఆరోపిస్తున్నారు.

పర్యావరణానికి ముప్పు..

విచ్చలవిడిగా జరుగుతున్న తవ్వకాల వల్ల భూమి సారం దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు, పర్యావరణంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నవారు చెబుతున్నారు. లోతైన గుంతల కారణంగా పశువులు, చిన్నారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, వర్షాకాలంలో ఈ గుంతల్లో నీరు నిలిచి మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంటున్నారు.

విచారణ చేపట్టాలని డిమాండ్..

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు.

Next Story