నవ్వుతూ సాగిన ప్రయాణంలో నూరేళ్ల విషాదం.. 25 రోజుల వ్యవధిలో ముగ్గురు బాల్య స్నేహితుల మృతి!

by Jakkula.Mamatha |

చిన్నప్పుడు కలిసి పాఠశాలకు వెళ్లిన అడుగులు.. సాయంత్రాలు కలిసి ఆడుకున్న మైదానాలు.. ఒకరి ఇంట్లో మరొకరు భోజనం చేసిన రోజులు.. జీవితంలో ఏ కష్టం వచ్చినా భుజం తట్టి ధైర్యం చెప్పుకున్న స్నేహం.. ఇవన్నీ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

నవ్వుతూ సాగిన ప్రయాణంలో నూరేళ్ల విషాదం.. 25 రోజుల వ్యవధిలో ముగ్గురు బాల్య స్నేహితుల మృతి!
X

దిశ,గంభీరావుపేట: చిన్నప్పుడు కలిసి పాఠశాలకు వెళ్లిన అడుగులు.. సాయంత్రాలు కలిసి ఆడుకున్న మైదానాలు.. ఒకరి ఇంట్లో మరొకరు భోజనం చేసిన రోజులు.. జీవితంలో ఏ కష్టం వచ్చినా భుజం తట్టి ధైర్యం చెప్పుకున్న స్నేహం.. ఇవన్నీ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఒకే ప్రమాదం ముగ్గురు ప్రాణ స్నేహితులను పొట్టనబెట్టుకోవడంతో గంభీరావుపేట మండలం కన్నీరుమున్నీరవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన బంగ్లా అన్వేష్ గౌడ్(25), కోట అనిల్ (24), దుంపల వికాస్ (23) చిన్నప్పటి నుంచి విడదీయరాని స్నేహితులు. చదువు పూర్తయ్యాక జీవితంలో ఒక్కొక్కరు ఒక్కో దారిని ఎంచుకున్నా, వారి స్నేహం మాత్రం ఎప్పటికీ మారలేదు.

అన్వేష్ ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నాడు. కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అనిల్ హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి, రెండేళ్లు గల్ఫ్‌లో ఉద్యోగం చేశాడు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చి తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలుస్తూ కుటుంబానికి బలంగా మారాడు. వికాస్ కూడా తన కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఎన్నో కలలతో కష్టపడుతున్నాడు. అయితే వారి జీవితాలను విధి ఒక్క క్షణంలో తారుమారు చేసింది. గత నెల జూన్ 26న వ్యక్తిగత పనిమీద కామారెడ్డికి కారులో వెళ్లిన ముగ్గురు తిరుగు ప్రయాణంలో మాచారెడ్డి మండలం కాకులగుట్ట తండా సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

తీవ్రంగా గాయపడిన అన్వేష్, వికాస్‌లను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు పంపించారు. ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా.. అన్వేష్ మరుసటి రోజే మృత్యువుతో పోరాటంలో ఓడిపోయాడు. ఇక వికాస్ మాత్రం 25 రోజుల పాటు ఆసుపత్రి మంచంపై జీవన్మరణ పోరాటం చేసి, మంగళవారం ఉదయం అతడు కన్నుమూయడంతో ఒకే ప్రమాదంలో ముగ్గురు బాల్య స్నేహితుల జీవిత ప్రయాణం ముగిసింది. ఈ ముగ్గురిలో ఇద్దరు తమ తల్లిదండ్రులకు ఏకైక కుమారులు కావడం ఆ కుటుంబాల విషాదాన్ని మరింత పెంచింది. తమ వృద్ధాప్యంలో అండగా ఉంటారని ఆశించిన తల్లిదండ్రులకు ఇప్పుడు వారి జ్ఞాపకాలే మిగిలాయి. ఒకే పాఠశాలలో చదివిన ముగ్గురు.. ఒకే కారులో ప్రయాణం చేసిన ముగ్గురు.. చివరకు ఒకే ప్రమాదానికి బలై ఒకే జ్ఞాపకంగా మిగిలిపోయారు. వారి మరణం మూడు కుటుంబాలనే కాదు.. గంభీరావుపేట గ్రామం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

Next Story