తాళం వేస్తే టెన్షన్.. కొరటికల్‌లో వరుస చోరీలతో భయాందోళన

by Ratna Kumari |

ఆత్మకూరు మండలంలోని కొరటికల్ గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలు గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

తాళం వేస్తే టెన్షన్.. కొరటికల్‌లో వరుస చోరీలతో భయాందోళన
X

దిశ, ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు మండలంలోని కొరటికల్ గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలు గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికైనా, ఇతర పనుల నిమిత్తం బయటకైనా వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. గ్రామంలో జూన్ 27న దంతూరి మల్లేష్ ఇంట్లో, జూలై 5న కోలిపాక చంద్రశేఖర్ ఇంట్లో చోరీలు జరిగాయి. తాజాగా సోమవారం రాత్రి నంగునూరి సత్తయ్య ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు గ్యాస్ సిలిండర్‌తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పగటి వేళల్లో గ్రామంలో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసుల నిఘాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరాల మరమ్మతులు, నిర్వహణపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరుస చోరీలతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో రాత్రి గస్తీని మరింత ముమ్మరం చేసి, చోరీలకు పాల్పడుతున్న వారిని త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story