కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో మొబైల్ చోరీలు.. నిందితుడి అరెస్టు

by Ratna Kumari |

తిరుపతి–ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల మొబైల్ ఫోన్లు చోరీ చేసిన నిందితుడిని నిజామాబాద్ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బంది మంగళవారం సంయుక్తంగా అరెస్టు చేశారు.

కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో మొబైల్ చోరీలు.. నిందితుడి అరెస్టు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తిరుపతి–ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల మొబైల్ ఫోన్లు చోరీ చేసిన నిందితుడిని నిజామాబాద్ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బంది మంగళవారం సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు ఇటీవల కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు ప్రయాణికుల మొబైల్ ఫోన్లను చోరీ చేయగా, మూడు నెలల క్రితం ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో మరో మొబైల్ ఫోన్‌ను దొంగతనం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.

మంగళవారం సాయంత్రం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై రైల్వే పోలీసులు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా హిప్పర్గా తాడి గ్రామానికి చెందిన ధర్మాజీ నాగబోయి అంకేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించడంతో అతడి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Next Story