దిశ ఎఫెక్ట్: అటవీ భూముల ఆక్రమణలపై డీఎఫ్‌వో సీరియస్

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల గ్రామ శివారులోని 730 కంపార్ట్‌మెంట్ నంబర్‌లో అటవీ భూములు ఆక్రమణలకు గురికావడం, ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను ధ్వంసం చేయడంపై జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) నీరజ్ కుమార్ త్రిబ్రివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ ఎఫెక్ట్: అటవీ భూముల ఆక్రమణలపై డీఎఫ్‌వో సీరియస్
X

దిశ, లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల గ్రామ శివారులోని 730 కంపార్ట్‌మెంట్ నంబర్‌లో అటవీ భూములు ఆక్రమణలకు గురికావడం, ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను ధ్వంసం చేయడంపై జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) నీరజ్ కుమార్ త్రిబ్రివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్మల్ల గ్రామ శివారులో గ్రామపంచాయతీ, ఈజీఎస్ నిధులతో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ కేజ్‌వీల్‌తో ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జూలై 19న ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన దుండగులు, జూలై 20న ధ్వంసం చేసిన మొక్కలను పరిశీలించిన ఏపీవో.. పోలీసులకు ఫిర్యాదు అనే శీర్షికలతో దిశలో ప్రచురితమైన కథనాలకు స్పందించిన డీఎఫ్‌వో వెంటనే విచారణకు ఆదేశించారు.

పరిశీలన సందర్భంగా గ్రామ సర్పంచ్ భర్త గడ్డం నరేష్, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్‌తో కలిసి అటవీ భూములను పరిశీలించిన డీఎఫ్‌వో, ఎకరాల కొద్దీ అటవీ భూములు ఆక్రమణలకు గురవుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించలేదని ఎల్లారెడ్డి రేంజ్ ఫారెస్ట్ అధికారి రమేష్, బొల్లారం సెక్షన్ ఆఫీసర్ విక్కీ మార్టిన్, పర్మల్ల బీట్ ఆఫీసర్ శ్యాంసుందర్, బేస్ క్యాంప్ సిబ్బంది జీవన్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీట్ ఆఫీసర్ శ్యాంసుందర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సెక్షన్ ఆఫీసర్ విక్కీ మార్టిన్‌ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ కు సిఫారసు చేశారు. అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేయాలని రేంజ్ అధికారి రమేష్‌ను డీఎఫ్‌వో ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఇద్దరు యువకులను ఎల్లారెడ్డి రేంజ్ కార్యాలయానికి తరలించారు. అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అటవీ సిబ్బందిపైనా కఠిన చర్యలు తప్పవని డీఎఫ్‌వో నీరజ్ కుమార్ త్రిబ్రివాల్ హెచ్చరించారు.

Next Story