‘సన్న వడ్ల కుంభకోణం’ వార్తలు.. మంత్రి ఉత్తమ్ రియాక్షన్ ఇదే!

by Kema Shiva Kumar |

సన్న వడ్ల కుంభకోణం వార్తలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

‘సన్న వడ్ల కుంభకోణం’ వార్తలు.. మంత్రి ఉత్తమ్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సన్న వడ్ల కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ వస్తున్న కథనాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తీవ్రంగా స్పందించారు. సన్న వడ్ల కుంభకోణం అనేది పూర్తిగా అవాస్తవమని.. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి కొందరు కావాలనే కాంగ్రెస్ పాలనపై బురద జల్లేందుకు సన్న వడ్ల కుంభకోణమంటూ ఫేక్ ప్రచారాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్కాములు జరిగి ఉండవచ్చు కానీ, తమ ప్రభుత్వంలో ప్రతీదీ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. ధరలు పెంచి టెండర్ కోట్ చేయడం వల్ల తొలుత ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. అందుకే సాంకేతిక నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

హరీష్ రావుపై తీవ్ర విమర్శలు..

మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ సీరియస్ అయ్యారు. హరీష్ రావు మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలని అున్నారు. నిజంగా ఆయన పెద్ద ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్ అయితే గతంలో కేసీఆర్ (KCR) ఆయనను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలన్నారు. మరదలు కవిత (Kavitha) అడుగుతున్న ఏ ప్రశ్నకు హరీశ్‌రావు దగ్గర సమాధానం లేదన్నారు. అలాగే గతంలో జరిగిన రూ.1,400 కోట్ల వ్యవహారంలో ఆయన సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. దేవాదులలో ప్రస్తుతం 7 పంపులు విజయవంతంగా నడుస్తున్నాయని, ఇవాళ మరో రెండు పంపులు అందుబాటులోకి వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story