భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు.. 20 మంది మృతి

by Naga Rani Yarlagadda |

ఆప్ఘనిస్తాన్ లో ఆకస్మిక వరదలు పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకున్నాయి.

భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు.. 20 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆప్ఘనిస్తాన్ లో ఆకస్మిక వరదలు పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈశాన్య ప్రాంతమైన నూరిస్థాన్ ప్రావిన్స్ లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ జలప్రళయంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గల్లంతయ్యారు. దుర్గమ పర్వత ప్రాంతంలో సహాయక బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తుండటంతో.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారిలో ప్రావిన్స్ రాజధాని పరూన్ మేయర్ సహా.. ఆయన ఇద్దరు సెక్యూరిటీగార్డులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ వరదల కారణంగా పరూన్ నగరం అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నట్లు తాలిబన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉగ్రరూపం దాల్చిన వరద ఇళ్లను, వ్యాపార సముదాయాలను ముంచేసింది. వరద నీటిలో నిత్యావసర వస్తువులు కొట్టుకుపోయాయి. 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు గల్లంతైన వారికోసం రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టగా.. రోడ్లు ధ్వంసం కావడం, క్లిష్టమైన పర్వత ప్రాంతం కావడంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకునేందుకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేశారు.

Next Story