ఉగ్రవాదంపై ఉక్కుపాదం - 'ఆపరేషన్ సింధూర్'తో శత్రువులకు గట్టి హెచ్చరిక

by Malleboina Mahesh |   (  Updated:2026-01-13 09:00:39  IST  )

వార్షిక విలేకరుల సమావేశంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం - ఆపరేషన్ సింధూర్తో శత్రువులకు గట్టి హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: వార్షిక విలేకరుల సమావేశంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాటాల సంఖ్య, తీవ్రతలో గణనీయమైన పెరుగుదల కనిపించిందన్నారు. ఈ నేపథ్యంలో, ఆపరేషన్ సిందూర్, భారతదేశం యొక్క సరిహద్దు ఉగ్రవాదానికి క్రమాంకనం చేయబడిన, దృఢమైన ప్రతిస్పందన మన సంసిద్ధత, ఖచ్చితత్వం, వ్యూహాత్మక స్పష్టతను ప్రదర్శించిందని ద్వివేది చెప్పుకొచ్చారు.

అలాగే పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' శత్రువుల అణు ప్రగల్భాలకు (nuclear rhetoric) చెక్ పెట్టిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మే 7న ప్రారంభమై 88 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో, భారత సైన్యం సరిహద్దు దాటి లోతుగా వెళ్లి నిర్దేశిత 9 లక్ష్యాల్లో 7 ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసిందని తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, భవిష్యత్తులో శత్రువులు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా గట్టి బదులు ఇస్తామని ఆయన హెచ్చరించారు. 2025లో పశ్చిమ సరిహద్దులో పరిస్థితి అదుపులోనే ఉందని, ఈ ఏడాది మొత్తం 31 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా, అందులో 65 శాతం మంది పాకిస్తానీలేనని ఆయన స్పష్టం చేశారు.

జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతంలో శాంతి భద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయని జనరల్ ద్వివేది సంతోషం వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాద నియామకాలు దాదాపు శూన్యమని, ఆ ప్రాంతం ఇప్పుడు 'ఉగ్రవాదం నుంచి పర్యాటకం' వైపు వేగంగా మారుతోందని, ఇందుకు రికార్డు స్థాయిలో సాగిన అమర్‌నాథ్ యాత్రే నిదర్శనమని పేర్కొన్నారు. అదేవిధంగా, మణిపూర్‌లో భద్రతా బలగాల చర్యల వల్ల పరిస్థితి కుదుటపడిందని, కుకీ తిరుగుబాటు దళాలతో 'సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్' (SoO) ఒప్పందం పునరుద్ధరణ, డురాండ్ కప్ నిర్వహణ అక్కడ స్థిరత్వానికి కీలక సూచికలని ఆయన వివరించారు.

ఉత్తర సరిహద్దు (చైనా) వెంబడి పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ నిరంతర నిఘా అవసరమని ఆర్మీ చీఫ్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చల ద్వారా విశ్వాసం పెరుగుతోందని, ఇది సరిహద్దులో పశువుల మేత వంటి సాధారణ కార్యకలాపాలకు దారితీస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. 'సిద్ధంగా ఉన్న దేశాలే విజయం సాధిస్తాయ'ని, ప్రధాని పిలుపునిచ్చిన 'జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్' (JAI) స్ఫూర్తితో.. రక్షణ శాఖ సంస్కరణలతో భారత ఆర్మీ భవిష్యత్తు సవాళ్లకు పూర్తి సంసిద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు.

Read More.. వార్తల విశ్వసనీయతే మా బలం - ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది

"వెంటనే ఇరాన్ విడిచి రావాలని అమెరికా పౌరులకు వర్చువల్ ఎంబసీ హెచ్చరిక

Next Story