- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిగ్విజయంగా రెండేండ్లు.. రాజకీయంగా బలపడ్డ కాంగ్రెస్
రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. విజయవంతంగా రెండేండ్లు పూర్తి చేసుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. విజయవంతంగా రెండేండ్లు పూర్తి చేసుకున్నది. 2023 డిసెంబర్ 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో దాదాపు లక్ష మంది సమక్షంలో అప్పటి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆధ్వర్యంలో సీఎంగా రేవంత్ రెడ్డి, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు.
ఆకట్టుకుంటున్న ఆరు గ్యారంటీలు
ప్రభుత్వం ఏర్పాటైన రోజే రెండు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మహిళలకు ఫ్రీ బస్సు స్కీం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో గ్యారంటీని అమలు చేయడం మొదలుపెట్టింది. అనంతరం మూసీ ప్రక్షాళనతో పాటు హైడ్రాను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వానికి తలెత్తిన ఆర్థిక సమస్యలను ప్రజలకు పలు వేదికలపై సీఎంతో పాటు మంత్రులు వివరించారు. ఆ తర్వాత రూ.రెండు లక్షల లోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. రైతుభరోసా నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేయడంతో రైతుల్లో ప్రభుత్వంపై మరికొంత సానుకూల వాతావారణం ఏర్పడింది. వర్షాలు అధికంగా కురవడంతో వ్యవసాయ సాగుకు కావాల్సిన యూరియా కొరత వేధించింది. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆ సమస్య తగ్గింది.
జూబ్లీహిల్స్ విక్టరీతో మరింతగా..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నించి విజయం సాధించింది. మంత్రులు సైతం కలిసికట్టుగా పనిచేయడం సైతం విజయానికి దోహదపడింది. దీంతో అప్పటి వరకు పార్టీలోని పలువురిలో ఉన్న అసంతృప్తులు తగ్గడంతో పాటు రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూరింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు టర్నింగ్ పాయింట్ అని.. ఇది కేడర్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం
అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. దీంతో పాటు ఆయనను ఘనంగా సత్కరించింది. పలు కార్యక్రమాలకు ఉద్యమకారులను ఆహ్వానించి వారి నుంచి మన్ననలు పొందింది.
పెట్టుబడులు.. ఖాళీల భర్తీ
దావోస్ పర్యటన ద్వారా సుమారు రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులను ప్రభుత్వం సాధించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేసింది. ఇప్పటి వరకు సుమారు 60 వేల మందికి నియామకాలు అందించింది. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సైతం కసరత్తు చేస్తున్నది. దీంతో పాటు వేములవాడ, మేడారం ఆలయాలను పునర్నిర్మించేందుకు సర్కారు పూనుకున్నది. అందుకు నిధులు కేటాయించి.. సంబంధించిన పనులను సైతం మొదలు పెట్టింది. హ్యాం విధానంలో రోడ్లను అబ్ధివృద్ధి చేస్తున్నది.
క్యూర్.. ప్యూర్.. రేర్ విధానంలో అభివృద్ధి
రాష్ట్రాన్ని మూడు కేటగిరీలుగా (క్యూర్, ప్యూర్, రేర్) విభజించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసింది. స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్టు రెడీ చేసింది. దానిని అసెంబ్లీలో పెట్టిన రేవంత్ సర్కారు.. దీనిపై సీబీఐ విచారణ కోరారు.
స్థానిక ఎన్నికలపై ఫోకస్
ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ తమ మద్దతుదారులు విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. అందులో భాగంగానే జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించింది. మొదటి ఏడాదితో పోలిస్తే రెండో ఏడాది నాటికి కాంగ్రెస్ మరింత బలంగా తయారైందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాపాలన విజయోత్సవాలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట వేడుకలు జరుపుతున్నది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పేరిట ఘనంగా సదస్సు నిర్వహిస్తున్నది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా జరిగే ఈ సమ్మిట్‌లో మొత్తం 1,686 మంది ప్రతినిధులు, 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ డెలిగేట్లు హాజరు కానున్నారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో ఈ నెల 8, 9 తేదీల్లో సమ్మిట్‌ను సర్కారు నిర్వహిస్తున్నది.
Read More..






