తెలంగాణ రైజింగ్.. గ్లోబల్ సమ్మిట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-07 02:50:33  IST  )

వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్శించేందుకు, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8,9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నది.

తెలంగాణ రైజింగ్.. గ్లోబల్ సమ్మిట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్శించేందుకు, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8,9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు.‘తెలంగాణ రైజింగ్‌’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు, ఐటీ నిపుణులు, సినిమా, క్రీడలు, విద్యా రంగాల ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులంతా ఒకే వేదికపైకి రానున్నారు. సుమారు 4,800 మందికి ఆహ్వానం పంపిన ప్రభుత్వం ఇప్పటికే 600 కంటే ఎక్కువ మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల రాకను ధృవీకరించింది. మొత్తంగా 2,500కు పైగా ఆహ్వానితులు హాజరవుతారని అంచనా వేస్తోంది. సమ్మిట్‌లో రెండు రోజుల్లో 27కు పైగా సెషన్లు జరగనున్నాయి. సుమారు 100 ఎకరాల స్థలంలో అత్భుతంగా సమ్మిట్ వేదికను తీర్చిదిద్దుతున్నారు.

రూ.లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల ఒప్పందాలు

రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్‌లో రాష్ట్ర భవిష్యత్‌ అభివృద్ధి గురించి ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. అదే విధంగా రూ.లక్షల కోట్లకుపైగా పెట్టుబడి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్‌ లక్ష్యాలు, 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని 3 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చే వ్యూహాలపై పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమాలోచనలు చేయనున్నారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ (నెట్‌ జీరో), సెమీకండక్టర్‌ రంగం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, నైపుణ్యాలు కలిగిన మానవ సంపద అభివృద్ధి, మహిళలు, యువత ఆర్థిక సాధికారత, వ్యవసాయ ఆధారిత ఉద్యమాల ప్రోత్సాహం, క్రీడల వికాసం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. క్వాంటమ్, సైబర్‌సెక్యూరిటీ, జీన్‌ టెక్, ఏరోస్పేస్‌- డిఫెన్స్, స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లు, ఎంఎంఎస్‌ల బలోపేతం, టూరిజం, మీడియా- ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రమోషన్, సెమీకండక్టర్‌ పరిశ్రమలపై సైతం చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ భారీ సెమినార్ హాల్‌తో పాటు మరో మూడు మినీ సెమినార్ హాల్స్ ఏర్పాటు చేశారు. మూసీ పునర్వ్యవస్థీకరణ, అర్బన్ కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అగ్రి వ్యాల్యూ చైన్లు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, స్టార్టప్స్, పీపీపీ ప్రాజెక్టులు, ఫైనాన్షియల్ హబ్స్ ఏర్పాటు లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. మహిళా పారిశ్రామిక వేత్తలు, గిగ్ ఇకానమీ, టాలెంట్ మొబిలిటీపైనా చర్చలు జరగనున్నాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడా, ఆసియన్ దేశాలతో ప్రత్యేక సెషన్లు ఉండనున్నాయి.

బిజినెస్‌ ఫ్రెండ్లీ పాలసీలతో ముందుకు..

పర్యావరణ స్థిరత్వాన్ని ఆర్థిక ప్రగతితో సమతుల్యం చేయడం, గ్రీన్‌ ఎనర్జీ, సస్టైనబుల్‌ ప్రాక్టీస్‌లపై గ్లోబల్ సమ్మిట్‌లో చర్చలు నిర్వహించనున్నాయి. ఇందులో ప్రధానంగా ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ మొబిలిటీ, క్లైమేట్ ఫైనాన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్శించనున్నారు. మాన్యుఫాక్చరింగ్, ఐటీ- ఎమర్జింగ్‌ టెక్, లైఫ్‌ సైన్సెస్, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీలు)లో అవకాశాలు, మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బిజినెస్‌-ఫ్రెండ్లీ పాలసీలతో పెట్టుబడిదారులను ఆకర్శించనున్నారు.

ఆకట్టుకోనున్న సాంస్కతిక కార్యక్రమాలు

సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నారు. అతిథులకు విభిన్న సాంస్కృతిక, కళాత్మక ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ప్రముఖ స్వరకర్త కీరవాణి 90 నిమిషాల సంగీత ప్రదర్శనతో మంత్ర ముగ్ధులను చేయనున్నారు. ప్రసిద్ధ వీణా వాదకురాలు పి.జయలక్ష్మి, కళా కృష్ణ నేతృత్వంలో పేరణి నాట్యం, మాయాజాలికుడు సామల వేణు ప్రదర్శనలు ముఖ్య ఆకర్షణగా నిలవనున్నాయి. అదనంగా తెలంగాణ సంప్రదాయాలను ప్రదర్శించే కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గుడోలు, మహిళల డప్పు, పేరణి నృత్యం వంటి కళలు అతిథులను స్వాగతిస్తాయి.

అందరికీ ఆహ్వానం..

సదస్సుకు అందరికీ ఉచిత ఆహ్వానం ఉంటుంది. డిసెంబర్‌ 10 నుంచి 13 వరకు జరిగే కార్యక్రమాలను సాధారణ ప్రజలు ఎలాంటి రుసుము లేకుండా వీక్షించొచ్చు. ఈ నాలుగు రోజులూ సంగీత ఆర్కెస్ట్రా, భవిష్యత్‌ ప్రాజెక్టులపై సమావేశాలు, వివిధ శాఖల స్టాల్స్, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ఆసక్తి కలిగిన వారు సమావేశ స్థలానికి సులభంగా చేరుకునేందుకు ప్రభుత్వం ఉచిత బస్‌ సేవలను సిద్ధం చేసింది. ఇవి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు (వెళ్లేవి), సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు (తిరిగి వచ్చేవి) అందుబాటులో ఉంటాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్బీనగర్‌ వంటి ప్రాంతాల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

గ్లోబల్ సమ్మిట్ ఎజెండా ఖరారు

గ్లోబల్‌ సమ్మిట్‌ ఎజెండాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 9వ తేదీ సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌ మ్యాప్‌ను ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించనుంది.

Read More..

దిగ్విజయంగా రెండేండ్లు.. రాజకీయంగా బలపడ్డ కాంగ్రెస్

ప్రపంచం చూపంతా ‘ఫ్యూచర్’ వైపే

Next Story