Tata Capital: గోల్డ్ లోన్ మార్కెట్‌లోకి టాటా క్యాపిటల్

by S Gopi |

ఈ ఒప్పందం ద్వారా టాటా క్యాపిటల్ సుమారు రూ.318 కోట్లతో యోగ్‌లోన్స్‌లో దాదాపు 88.6 శాతం వాటాను సొంతం చేసుకోనుంది.

Tata Capital: గోల్డ్ లోన్ మార్కెట్‌లోకి టాటా క్యాపిటల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వేగంగా విస్తరిస్తున్న గోల్డ్ లోన్ మార్కెట్‌లోకి టాటా క్యాపిటల్ అడుగు పెడుతోంది. కేరళకు చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) యోగక్షేమం లోన్స్ లిమిటెడ్ (యోగ్‌లోన్స్)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ద్వారా టాటా క్యాపిటల్ సుమారు రూ.318 కోట్లతో యోగ్‌లోన్స్‌లో దాదాపు 88.6 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఇందులో ప్రస్తుత వాటాదారుల నుంచి వాటాల కొనుగోలుతో పాటు సుమారు రూ.93 కోట్ల కొత్త మూలధన పెట్టుబడి కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. నియంత్రణ సంస్థల అనుమతులు పూర్తయిన తర్వాత లావాదేవీ అమల్లోకి రానుంది. పెరుగుతున్న బంగారం ధరలు, ఇన్‌స్టంట్ లోన్‌ల కోసం వినియోగదారుల డిమాండ్ కారణంగా దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ వేగంగా పెరుగుతున్న సమయంలో ఈ కొనుగోలు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది మార్చి నాటికి యోగ్‌లోన్స్ రూ.708 కోట్ల ఆస్తులను నిర్వహిస్తుండగా, సుమారు 32,000 మంది గోల్డ్ లోన్ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. గోల్డ్ లోన్లతో పాటు వాహన రుణాలు, వ్యాపార రుణాలు, వినియోగ రుణాలు వంటి ఇతర విభాగాల్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Next Story