మహిళా ఐఏఎస్‌ పట్ల మీడియా కథనాలను ఖండించిన ఐఏఎస్ సంఘం

by Prasad Jukanti |   (  Updated:2026-01-10 10:11:03  IST  )

తెలంగాణ కేడర్ కు చెందిన ఓ మహిళా ఐఏఎస్, ఓ మంత్రి విషయంలో వచ్చిన మీడియా కథనాల పట్ల ఐఏఎస్ సంఘం సీరియస్ అయింది.

మహిళా ఐఏఎస్‌ పట్ల మీడియా కథనాలను ఖండించిన ఐఏఎస్ సంఘం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై మీడియాలో వచ్చిన కథనాలను తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్ (Telangana IAS Officers Association) తీవ్రంగా ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా మహిళా అధికారులపై దురుద్దేశపూరితమైన నిరాధార ఆరోపణలతో నిండి ఉందని అనవసర సందేహాలు రేపే ప్రయత్నం చేశారని ఖండించింది. ఇటీవల తెలంగాణ కేడర్‍కు చెందిన ఓ మహిళా ఐఏఎస్‍, ఓ మంత్రిపై ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ కథనం ప్రసారం చేసింది. ఈ కథనంపై స్పందించిన ఐఏఎస్ అధికారుల సంఘం నిజాయతీగా పనిచేస్తున్న అధికారుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు తగదని నిరాధారణమైన ఆరోపణలు చేసిందుకు సదరు న్యూస్ చానల్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పి ఆ కంటెంట్ ను అన్ని ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రామకృష్ణారావు, అసోసియేషన్ సెక్రటరీ జయేశ్ రంజన్ లేఖను విడుదల చేశారు.

బాధ్యతగా వ్యవహరించండి:

సదరు టీవీ చానల్ ప్రసారం చేసిన కథనం మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడిందని ఇది వేధింపులకు సమానం అని అసోసియేషన్ ఖండించింది. మహిళా ఐఏఎస్ అధికారులకు తక్కువ కాలంలోనే ‘సౌకర్యవంతమైన పోస్టింగ్’లు ఇచ్చారని చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యం అని ఇలాంటి కథనాలు సివిల్ సర్వీసుల విశ్వసనీయతను దెబ్బతిస్తూ రాజ్యాంగబద్ధమైన పోస్టులు, బదిలీ వ్యవస్థపై అపనమ్మకం కలిగించే ప్రయత్నం అని అసోసియేషన్ విమర్శించింది. సదరు న్యూస్ చానల్ ఈ కథనాన్ని ప్రసారం చేసిన తర్వాత ఇతర మీడియా సంస్థలు కూడా అదే పరువు నష్టం కలిగించే విషయాలను పునఃప్రసారం చేశాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి బాధ్యతారహిత, అనైతిక జర్నలిజానికి దూరంగా ఉండాలని అన్ని మీడియా సంస్థలను హెచ్చరించింది. ఈ ఘటనను సివిల్ సర్వీస్ ఉద్యోగుల మనో ధైర్యం, స్వతంత్రత, గౌరవంపై తీవ్రమైన దాడిగా సంఘం భావిస్తోందని మీడియా సంస్థలు జర్నలిజం నైతిక ప్రమాణాలను పాటించాలని సూచించింది. మీడియా ట్రయల్ నిర్వహించడం, వదంతులను వార్తల ముసుగులో ప్రచారం చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. పరువు నష్టం కలిగించే కథనాలు రూపొందిస్తే వీటికి బాధ్యతులై వ్యక్తులు, సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది .

Read More... తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

నువ్వు అంత బాధపడాల్సిన అక్కర్లేదు.. హరీశ్‌రావుకు మంత్రి పొన్నం కౌంటర్


Next Story