కార్యకర్తలకు లాఠీ దెబ్బలు.. బర్గర్ షాప్‌లో లీడర్ చిల్! CJP అధికార ప్రతినిధిపై వేటు

by Ramesh Naini |

ఢిల్లీలో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన సమయంలో, ఆ పార్టీ అధికార ప్రతినిధి విజేతా దహియా ఒక బర్గర్ అవుట్‌లెట్‌లో కనిపించినట్లు తీవ్ర దుమారం రేపింది.

కార్యకర్తలకు లాఠీ దెబ్బలు.. బర్గర్ షాప్‌లో లీడర్ చిల్! CJP అధికార ప్రతినిధిపై వేటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన సమయంలో, ఆ పార్టీ అధికార ప్రతినిధి విజేతా దహియా ఒక బర్గర్ అవుట్‌లెట్‌లో కనిపించినట్లు తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పార్టీ అధిష్టానం అతడిని పదవి నుంచి శాశ్వతంగా తొలగించింది.

అసలేం జరిగిందంటే?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలను నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద CJP ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పార్లమెంట్ వైపు వెళ్తున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కార్యకర్తలు, మద్దతుదారులు పోలీసుల దెబ్బలు తింటుంటే.. దహియా మాత్రం ఢిల్లీలోని ఒక మాల్‌లో బర్గర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు యువకులు బర్గర్ షాపులో దహియాను చుట్టుముట్టి ‘కార్యకర్తలు పోరాడుతుంటే మీరిక్కడ బర్గర్లు తింటున్నారా?’ అని నిలదీసిన వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన CJP, ఇది పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని, అత్యంత బాధ్యతారాహిత్యమని మండిపడింది. ఈ మేరకు దహియాను అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి పూర్తిగా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆకలేసి వెళ్లాను.. కానీ బర్గర్ తినలేదు: దహియా

తనపై వస్తున్న విమర్శలకు దహియా సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. ఆకలితో ఉండబట్టే అక్కడికి వెళ్లానని సమర్థించుకున్నారు. ‘ఆకలి వేస్తే ఎవరైనా ఏం చేస్తారు? నేను బర్గర్ ఎందుకు తిన్నానంటే నాకు ఆకలి వేసింది. రెండు రాత్రులుగా నిద్రపోలేదు. నిరసన ముగిశాకే అక్కడికి వెళ్లాను’ అని దహియా తెలిపారు. ఇంత జరిగినా చివరికి ఆ బర్గర్‌లో మైదా, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. అందుకే నేను దానిని తినకుండానే వచ్చేశాను. దేశం కోసమే నా ఆరాటం’ అని చెప్పుకొచ్చారు. కాగా, దహియా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ట్రాన్స్‌జెండర్ల పట్ల, అలాగే ‘చాలామంది మహిళలకు రాజకీయాలంటే పడదు’ అంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఈ ‘బర్గర్’ ఎపిసోడ్ తో ఏకంగా పదవికే ఎసరు వచ్చింది.

Next Story