Kalvakuntla Kavitha: కొత్త సంస్థగా తెలంగాణ జాగృతి.. ఎమ్మెల్సీ కవిత ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-07-26 09:13:09  IST  )

కొత్త సంస్థగా తెలంగాణ జాగృతి అవతరించబోతున్నదని ఎమ్మెల్సీ కవిత కామెంట్ చేశారు.

Kalvakuntla Kavitha: కొత్త సంస్థగా తెలంగాణ జాగృతి.. ఎమ్మెల్సీ కవిత ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొ.జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన 'లీడర్' శిక్షణా తరగతులకు హాజరైన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంబో కమిటీల ఏర్పాటు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతిజిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలన్నారు.

నవతరం లీడర్లకు జాగృతి అండ :

సమాజంలో మార్పు తేవడంలో రాజకీయాలు ఓ మార్గం అని, పాలిటిక్స్‌లోకి రావాలనుకునే వారికి, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదు అనుకునే వారికి మీ వెనక తెలంగాణ జాగృతి అండగా ఉంటుందన్నారు. కంటెంట్, క్యాలిబర్, లాజిక్ లేనోడే తిట్లకు దిగజారుతాడని కవిత అన్నారు. ఎన్ని తిట్లు తిడితే అన్ని వ్యూస్ వస్తాయని యూట్యూబర్ల అండ కూడా వాళ్లకే ఉంటుందన్నారు. పక్కవాడిని కొట్టకుండానే వాడిలోని ఆలోచనను తుంచేసేంత పదునుగా తెలంగాణ జాగృతి పని చేయాలన్నారు. ఓ పక్క మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, మదర్ థెరిసా, చాకలి ఐలమ్మ, మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరాల మంచితనం, పోరాటతత్వం, సమయస్ఫూర్తి అన్ని కలగలిసిన నాయకుడిగా తెలంగాణ జాగృతి నాయకులను సిద్ధం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన లీడర్ కాలేరని సమాజానికి తొలి లీడర్ ఇల్లాలే అని అన్నారు.

రాజకీయంగా కన్ఫ్యూజన్ ఉంది:

రాజకీయంగా బయట చాలా కన్ఫ్యూజన్‌గా ఉందని తెల్లారితే ఎవరు పడితే వారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారని కానీ, తెలంగాణ జాగృతి శ్రేణులకు క్లారిటీ ఉండాలన్నారు. మనం చేసేది అంతిమంగా కేవలం తెలంగాణ బాగుండటం కోసమేనని చెప్పారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు తెలంగాణకు చేటు చేసే ఆలోచన చేయరని అదే సమయంలో తెలంగాణకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరని అన్నారు. నాడు పోలవరం ప్రాజెక్టు కడుతుంటే అడ్డుపడ్డాం, నేడు బనకచర్ల లింక్ ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోబోమని కచ్చితంగా ఆపి తీరుతామన్నారు. తెలంగాణ వనరులు, సాంస్కృతి పరిరక్షించడమే ఆలోచనగా జాగృతి పనిచేస్తుందన్నారు. తెలంగాణ రేపటి రాజకీయం ఎలాఉండాలి, యువ నాయకత్వం, మహిళా నాయకత్వం, బహుజన నాయకత్వం ఎలా పైకి రావాలనే అంశాలపై నిరంతరం పని చేస్తూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Read More..

KTR: పార్టీలో నెం.2 ఇమేజ్ కోసం కేటీఆర్ ఏకంగా రూ.600 కోట్లు ఖర్చు!

తెలంగాణ జాగృతి ‘లీడర్’ శిక్షణకు సర్వం సిద్ధం.. హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

Next Story