- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING: పోలవరం - నల్లమల సాగర్‌పై సుప్రీం కీలక తీర్పు.. తెలంగాణ పిటిషన్ విత్ డ్రా
పోలవరం - నల్లమల సాగర్ ఇష్యూపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం - నల్లమల సాగర్ ఇష్యూపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. విచారణకు అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల మధ్య ఉండే జల వివాదాలను ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ద్వారానే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను ఉప సంహరించుకుంది. దీనిపై సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలిపింది. కోర్టు సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కర్ణాటక, మహారాష్ట్రలను కూడా ప్రతివాదులుగా చేర్చుతూ ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా, ఈ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ముందు లేదా మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
మహారాష్ట్ర, కర్ణాటకల ప్రమేయం
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ హాజరై వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండానే డీపీఆర్ (DPR) పనులు చేపడుతోందని, ఇది తెలంగాణ జల ప్రయోజనాలకు విఘాతమని వాదించారు. అయితే, కోర్టు సూచనల మేరకు సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఈ వివాదం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. గోదావరి జలాల పంపిణీలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా సంబంధం ఉన్నందున, వారిని కూడా ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
రిట్ పిటిషన్ లో పేర్కొన్న అంశాలివి..
పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ లేదా నల్లమల సాగర్ జలాశయానికి లింక్ చేసేలా గోదావరిపై ఏపీ ప్రాజెక్టు నిర్మిస్తోందని రిట్ పిటిషన్ లో పేర్కొంది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఏపీకి ఎలాంటి అనుమతులు లేవని, వెంటనే పనులను ఆపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది. పోలవరం ప్రాజెక్టు స్వరూపం కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మేరకే ఉండాలి గాని.. విస్తరణ పనులు చేపట్టడం చట్టవిరుద్ధమేనని పిటిషన్లో తెలిపింది. కేంద్రం కూడా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును పరిశీలనకు తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదంది. ప్రాజెక్టుపై నెక్ట్స్ స్టెప్ తీసుకోకుండా జలశక్తి మంత్రిత్వశాఖ, కేంద్ర జలసంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది. తాము కేవలం వరద జలాలనే వాడుకుంటున్నట్లు ఏపీ బదులిచ్చింది.






