గడ్డి మందు ప్రకటనలకే నిషేధమా..?! విక్రయాలు మాత్రం యథేచ్ఛగా..!

by Ratna Kumari |   (  Updated:2026-07-19 09:31:21  IST  )

వ్యవసాయంలో కలుపు మొక్కల నివారణ కోసం వినియోగించే కొన్ని ప్రమాదకర గడ్డి మందుల విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ, వాటి అమలు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గడ్డి మందు ప్రకటనలకే నిషేధమా..?! విక్రయాలు మాత్రం యథేచ్ఛగా..!
X

దిశ, తిరుమలగిరి : వ్యవసాయంలో కలుపు మొక్కల నివారణ కోసం వినియోగించే కొన్ని ప్రమాదకర గడ్డి మందుల విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ, వాటి అమలు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిషేధం ఉత్తర్వులకే పరిమితమై, కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుమలగిరి పట్టణంలోని కొన్ని ఎరువుల దుకాణాల్లో నిషేధిత గడ్డి మందులు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం వినియోగించాల్సిన ఈ రసాయనాలు ఇటీవల సామాజిక విషాదాలకు కూడా కారణమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యక్తిగత కక్షలు, ప్రతీకారాల నేపథ్యంలో పంటలపై గడ్డి మందు పిచికారీ చేసి రైతులకు నష్టం కలిగిస్తున్న ఘటనలు ఒకవైపు చోటుచేసుకుంటుండగా, కుటుంబ కలహాలు, అప్పుల బాధలు, మానసిక ఒత్తిడి వంటి కారణాలతో కొందరు అదే గడ్డి మందును సేవించి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మరోవైపు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇటీవల తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం 8వ వార్డుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో గడ్డి మందు సేవించి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆయన వినియోగించిన గడ్డి మందు స్థానికంగానే కొనుగోలు చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో నిషేధిత గడ్డి మందుల విక్రయాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటి అమలుపై వ్యవసాయ, పోలీసు, సంబంధిత శాఖలు సమన్వయంతో తరచూ తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో కొందరు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ నిషేధిత గడ్డి మందులను విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయానికి అవసరమైన కొన్ని ఎరువులు, పురుగుమందులు రైతులకు సకాలంలో అందుబాటులో లేకపోతున్నాయని, అదే సమయంలో నిషేధిత గడ్డి మందులు మాత్రం సులభంగా లభించడం అధికార యంత్రాంగం పనితీరుపై సందేహాలకు తావిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

నిషేధిత గడ్డి మందుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ప్రమాదకర రసాయనాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై రైతులు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిషేధం కేవలం ఉత్తర్వులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోనూ సమర్థంగా అమలు చేసినప్పుడే ఇలాంటి విషాదాలను నివారించవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Next Story