ఓటరు జాబితా సవరణలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలి

by Batti.Sumithra |

స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓటరు జాబితా సవరణ (SIR)పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో పాటు కాంగ్రెస్ నేతలు, పరిశీలకులు పాల్గొన్నారు.

ఓటరు జాబితా సవరణలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలి
X

దిశ, ధర్మసాగర్ : స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలో ఓటరు జాబితా సవరణ (S.I.R) పై నియోజకవర్గ SIR క్లస్టర్ ఇంచార్జ్ లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఏఐసీసీ పరిశీలకులు అహ్మద్ నాసిర్, టీపీసీసీ నియోజకవర్గ పరిశీలకులు దుద్దిల్ల శ్రీను బాబు, మాస్టర్ ట్రైనర్ రాజశేఖర్ రెడ్డి, హన్మకొండ, జనగామ డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, లకావత్ ధన్వంతి పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్లక్ష్యంగా తీసుకుంటే భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి అందకుండా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఓటరుకి ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని, డబుల్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, నకిలీ ఓట్ల తొలగింపుతో పాటు చట్టబద్ధమైన ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా చూడాలని సూచించారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని అన్నారు. ప్రస్తుతం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ లో తెలపడం సంతోషంగా ఉందని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిబద్దతతో పని చేస్తున్న క్లస్టర్ ఇంచార్జ్ లు, బీఎల్ఏ లకు అభినందనలు తెలిపారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి నియోజకవర్గ స్థాయి ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పై పూర్తి స్థాయి సమావేశం ఉంటుందని అన్నారు. 25వ తేదీకి ఇంకా 6 రోజుల సమయం ఉందని ఈ 6 రోజుల్లో ప్రతీ బూత్ లో 95 శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని సూచించారు. బీఎల్ఏలు, క్లస్టర్ ఇంచార్జ్ లు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలని తెలిపారు. 25వ తేదీన క్లస్టర్ ఇంచార్జ్ లు, బిఎల్ఏలు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులతో నియోజకవర్గ స్థాయి సమావేశం ఉంటుందని, ఈ సమావేశానికి క్లస్టర్ ఇంచార్జ్ ల పరిధిలోని బీఎల్ఏలు, సర్పంచులు గ్రామ అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత క్లస్టర్ ఇంచార్జ్ లదే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 100శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేసిన క్లస్టర్ ఇంచార్జ్ లకు కండువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, ఓటరు జాబితా సవరణ నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Next Story