- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదలకు ఇండ్లు కట్టమంటే... బొందల గడ్డలు కట్టిర్రు
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించాల్సింది పోయి బొందల గడ్డలు, వైకుంఠధామాలు నిర్మించిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ విమర్శించారు.

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించాల్సింది పోయి బొందల గడ్డలు, వైకుంఠధామాలు నిర్మించిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను పెద్దఎత్తున నిర్మిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజాపాలనను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని అన్నారు.
బీఆర్ఎస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు తన తండ్రి కేసీఆర్‌కు ఉన్న రాజకీయ లక్షణాలు లేవని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన సభలో బీఆర్ఎస్ నాయకుల మధ్య ఐక్యత కనిపించలేదని, పార్టీ నేతలు ఎవరికి వారు విడివిడిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేస్తోందని, అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. "సంగ్రామం" అనే పదానికి అర్థం తెలియని కేటీఆర్ "యువ సంగ్రామం" పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేయడం, నేరెళ్ల ఘటనలో దళితులపై దౌర్జన్యాలు జరిగాయని, రైతులు, దళితులను ఇబ్బందులకు గురిచేసిన ఘనత బీఆర్ఎస్‌కే దక్కుతుందని విమర్శించారు. తన నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలను సాగు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ కార్మికుల సమ్మెను అణచివేశారని, ఆర్టీసీ కార్మికులు మరణించిన తర్వాత మాత్రమే ఫిట్‌మెంట్ ప్రకటించారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే ప్రజాస్వామ్య సంప్రదాయాలకు గౌరవం ఇచ్చినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో హరీశ్ రావు, పద్మారావు కనిపించలేదని, వారు ఎక్కడ ఉన్నారో పార్టీ నాయకత్వమే చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు ఒక్కొక్కరు ఒక్కో దారిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను కేటీఆర్ కంటే ముందే ఉద్యమకారుడినని పేర్కొన్న సామెల్, పరస్పరం గౌరవంగా మాట్లాడితే తాము కూడా అదే విధంగా స్పందిస్తామని అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని, బీఎల్‌వోలకు సహకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తన నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 70 శాతం పూర్తైందని, పేదల ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పోత్నక్ ప్రమోద్ కుమార్, పిట్టల బాలరాజ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.






