రాబోయే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం..

by Disha Web Desk 20 |
రాబోయే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం..
X

దిశ, షాబాద్ : షాబాద్ మండల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి మెజార్టీ స్థానాలు సాధించి అధికార పీఠం దక్కించుకోవడం ఖాయమని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం నాగర్ గూడ నుంచి షాబాద్ వరకు షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. కేసీఆర్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలు చతికిల పడ్డాయి అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇటువంటి ప్రజాసంక్షేమ మేనిఫెస్టో ప్రకటించలేదని స్పష్టం చేశారు.

చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కేసీఆర్ రెండోసారి బీఫామ్ ఇచ్చి ఆశీర్వదించాలని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కు కానుకగా పంపించాలన్నారు. ఇదే అభిమానం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పై ఉందని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టనున్నారని స్పష్టం చేశారు. చేవెళ్ల గడ్డ పై కూడా ఎమ్మెల్యే కాలే యాదయ్య మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడని పేర్కొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే సిట్టింగ్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలయాదయ్య మాట్లాడుతూ తన గెలుపులో కార్యకర్తలు అందరూ భాగస్వాములు కావాలని గెలిపించే బాధ్యత మీది.. మీకు కావాల్సిన అభివృద్ధి పనులు చేసే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత హరినాద్ రెడ్డి, షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రామ గ్రామానికి, ఇంటింటికి అందాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరు నర్సింగ్ రావు, పార్టీ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story