Dharmendra Pradhan: 'ఆత్మ నిర్బర్‌తో పురోగతివైపు భారతదేశం'

by Dishanational2 |
Union Minister Dharmendra Pradhan Says, India Will Progress with Aatmanirbhar
X

దిశ, కంది : Union Minister Dharmendra Pradhan Says, India Will Progress with Aatmanirbhar| ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా దేశం నూతన ఆవిష్కరణలు చేస్తూ ముందుకు దూసుకుపోతుందని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌లో నూతనంగా స్థాపించిన బీ.వీ.ఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్, రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్ భవనాలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ముందడుగు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో నూతన టెక్నాలజీని అందుపుచ్చుకోవడంలో భారత్ ముందు వరుసలో నిలుస్తుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా స్థాపింపబడిన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన భారత్ బయోటెక్, పూణే ప్రాంతానికి చెందిన శరం కంపెనీలు కరోనా వంటి విపత్కర పరిస్థితిలో మెడిసిన్, వ్యాక్సిన్ తయారీ చేసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలకంగా నిలిచాయన్నారు. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ప్రజలకు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే సగం దేశాలకు తమ వ్యాక్సిన్ని అందజేస్తుండడం ఎంతో గొప్ప విషయం అని కొనియాడారు. అయితే దేశంలోని ఐఐటీలు ఇప్పుడు నూతన పరిశోధన కేంద్ర నిలయాలుగా మారడం విశేషమన్నారు.


దేశంలో టెక్నాలజీని జోడించుకొని భారత్ అందుకు అవసరమైన పరికరాలను, ఇతర భారీ మెషిన్లను సైతం స్వతహాగా తయారు చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. కాగా, ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ కూడా దేశంలో ఒక పరిశోధన కేంద్రంగా ముందుకు సాగుతుందని కితాబు ఇచ్చారు. వందేళ్ల భారత స్వతంత్రం రోజునాటికి భారత దేశం నెంబర్ వన్ ఎనర్జీ సోర్స్‌గా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నూతన టెక్నాలజీని జోడించి సరికొత్త పరిశోధనల దిశగా దేశం ముందుకు సాగాలని అందుకు విద్యార్థులు నడుంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీవీ మోహన్ రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీ.ఎస్.మూర్తి, జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా, జైకా, సెయింట్ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed