కొత్త పార్టీలతో ఒరిగేదేమీ లేదు.. ఆవేశం ఎప్పుడూ పనికికాదు: కవిత పార్టీపై కేటీఆర్ స్పందన

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-27 13:11:49  IST  )

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీల రాకపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కొత్త పార్టీలతో ఒరిగేదేమీ లేదు.. ఆవేశం ఎప్పుడూ పనికికాదు: కవిత పార్టీపై కేటీఆర్ స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీల రాకపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీ (TRS - తెలంగాణ రాష్ట్ర సేన)పై స్పందిస్తూ.. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వస్తుంటాయని, పోతుంటాయని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేటీఆర్ వివరించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయడంలో భాగంగా స్టేట్ కమిటీ మినహా బూత్ కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే నిఖార్సైన కార్యకర్తలతో కొత్త కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం అని, భవిష్యత్ కార్యాచరణపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుంటామని కేటీఆర్ అన్నారు. "కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడతాం. ప్రజాసమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం" అని స్పష్టం చేశారు.

అదే బీఆర్ఎస్ నైజం..

జిల్లాల వారీగా పర్యటించి, అక్కడ నెలకొన్న స్థానిక సమస్యలను గుర్తించి పార్టీ తరపున నిరసనలు చేపడతామన్నారు. కార్యవర్గ సమావేశంలో పార్టీ బలోపేతానికి సంబంధించి పలు కీలక తీర్మానాలు చేశామని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడటమే బీఆర్ఎస్ నైజమని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

పార్టీ లైన్ తప్పితే సిట్టింగ్‌లకు కూడా సీటు ఇవ్వను: సొంత నేతలకు KCR సంచలన వార్నింగ్

బీఆర్ఎస్‍లో సంచలనం.. ఆ ఒక్కటి మినహా పాత కమిటీలన్నీ రద్దు

Next Story