బీఆర్ఎస్‍లో సంచలనం.. ఆ ఒక్కటి మినహా పాత కమిటీలన్నీ రద్దు

by Prasad Jukanti |   (  Updated:2026-04-27 12:10:08  IST  )

బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కీలక మార్పులు చేశారు. పాత కమిటీలను రద్దు చేసి త్వరలోనే కొత్త కమిటీలకు మార్గం సుగమం చేశారు.

బీఆర్ఎస్‍లో సంచలనం.. ఆ ఒక్కటి మినహా పాత కమిటీలన్నీ రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్‍ను మరింత పటిష్టం చేయడంతో పాటు రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్‍లో పాత కార్యవర్గాలను రద్దు చేశారు. కేవలం రాష్ట్ర కమిటీ మాత్రమే కంటిన్యూ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేత ఒకరు జిల్లాల ఇన్ చార్జీగా వ్యవహరించనున్నారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు వేడుకల్లో భాగంగా పార్టీ పలు కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేసింది. పాత కార్యవర్గాలు, కమిటీలతో పాటు అనుబంధ సంఘాలు సైతం రద్దు చేశారు. జూన్‍లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. సభ్యత్వాలను మాన్యువల్, డిజిటల్ రూపంలో చేపట్టనున్నారు. మెంబర్ షిప్ కమిటీలు అయ్యాక పెద్ద ఎత్తున జిల్లాల వారీగా సభ నిర్వహించనున్నారు.

తీర్మానాలు:

మహిళా చట్టం తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఈ సందర్భంగా పార్టీ తీర్మానించింది. ఈ బిల్లును వెంటనే పార్లమెంట్ లో పెట్టి అమలు చేయాలని తీర్మానించింది. అలాగే అన్ని రకాల పంటలు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అండగా ఉండాలని తీర్మానించారు. ఇటీవలే కాంగ్రెస్‍ను వీడి బీఆర్ఎస్‍లో చేరిన జీవన్ రెడ్డిని ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీకి కేసీఆర్ పరిచయం చేశారు. జీవన్ రెడ్డి అధికార పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చారని ఆయన సేవలను మనం ఉపయోగించుకుందామన్నారు.

Next Story