అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చరిత్ర కేసీఆర్‌దే.. మాజీ మంత్రి హరీశ్ రావు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-29 06:33:17  IST  )

‘రానే రాదు, కానే కాదు’ అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘన చరిత్ర ఒక్క కేసీఆర్‌దేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చరిత్ర కేసీఆర్‌దే.. మాజీ మంత్రి హరీశ్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రానే రాదు, కానే కాదు’ అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘన చరిత్ర ఒక్క కేసీఆర్‌దేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ రోజు ‘దీక్షా దివస్’ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పిందని అన్నారు. సరికొత్త చరిత్రకు నాంది పలికిందని, తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందని కొనియాడారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్‌దేనని అన్నారు.

పదవులే కాదు, తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం ఆయనదని తెలిపారు. తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్ అని అన్నారు. నాలుగు కోట్ల ప్రజల్లో మార్మోగే ‘జై తెలంగాణ’ అనే రణనాదమే ఆయన పేరని పేర్కొన్నారు. నవంబర్ 29న కేసీఆర్ దీక్ష లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదని.. ఆ ప్రకటనే లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. దశాబ్దాల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది తప్ప, పాలకుల దయాదాక్షిణ్యాలతో కాదన్నది అక్షర సత్యమని ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ గారి దీక్షా కాలం – ఉద్యమ జ్ఞాపకాలు నా గుండెలో పదిలంగా ఉన్నాయి. జై తెలంగాణ అని నినదీస్తున్నాయి. తెలంగాణ స్ఫూర్తిని నిత్యం రగిలిస్తున్నాయి..’ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Read More... కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏళ్లు పూర్తి.. ఆ పేరు ప్రస్తావించకుండా కల్వకుంట్ల కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్!

తెలంగాణ తలరాతను మార్చిన రోజు : కేటీఆర్ భావోద్వేగ ట్వీట్

Next Story