మీడియాపై దాడులు రేవంత్ పాలనకు నిదర్శనం : జర్నలిస్టుల అరెస్టుపై కేటీఆర్ ఫైర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-14 10:02:08  IST  )

రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని విమర్శించారు.

మీడియాపై దాడులు రేవంత్ పాలనకు నిదర్శనం : జర్నలిస్టుల అరెస్టుపై కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని విమర్శించారు. నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అర్ధరాత్రివేళ అరెస్టులు చేయడం సరికాదని, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మీడియాపై దమనకాండ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సైతం ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గారు.. మీరు నడుపుతోన్న మొహబ్బత్ కీ దుకాన్ తెలంగాణశాఖ పౌరుల రాజ్యాంగ హక్కుల్ని ఎలా కాలరాస్తుందో చూస్తున్నారని ఆశిస్తున్నాని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

అర్ధరాత్రి అరెస్టులు చేయాల్సిన అవసరమేంటి?

"పండుగ సమయంలో ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రతిసారి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది. జర్నలిస్టులను నేరస్తుల్లా వ్యవహరించేందుకు తెలంగాణ డీజీపీ ఎంతగా పట్టుబడుతున్నారో చూడటం దురదృష్టకరం. వారికి నోటీసులు ఇచ్చి, విచారణకు పిలవవచ్చు కదా. అలా చేయకుండా, అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అత్యుత్సాహం, హద్దులు దాటిన చర్య. అరెస్టు చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ కేసుల్లో నమోదు చేసిన సెక్షన్లలో ఏదీ నాన్‌-బెయిలబుల్ కాదు. అలాంటప్పుడు తెలంగాణ పోలీసులు ఎందుకు అర్ధరాత్రి అరెస్టులు చేసి జర్నలిస్టులను, వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారు? బీఎన్ఎస్ సెక్షన్ 35 ప్రకారం నోటీసులు ఇస్తే సరిపోయేదానికి ఇంత దౌర్జన్యం ఎందుకు? ఈ ఘటన ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. తెలంగాణ డీజీపీ చట్టబద్ధమైన విధానాన్ని పాటించాలని, కాంగ్రెస్ పార్టీ, దాని అప్రామాణిక నాయకత్వం చేస్తున్న చెడు రాజకీయాలకు పాల్పడకుండా ఉండాలని నేను కోరుతున్నాను." అని కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఈ మొత్తం ఘటనలో అసలు లీక్ చేసిన వ్యక్తి ఎవరు? అని ప్రశ్నించారు.

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో మహిళా ఐఏఎస్ ఆఫీసర్ , మంత్రి పై వచ్చిన కథనాలు తీవ్ర దుమారం పేరాయి. ఐఏఎస్ అధికారిణి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ కథనాలు రావడంపై కొన్ని న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో ఎన్టీవీ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణలు తెలిపింది. ఆ తర్వాత ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ లను పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల అరెస్టులను బీఆర్ఎస్ నేతలు, జర్నలిస్టుల సంఘాలు ఖండించాయి.

Read More... జర్నలిస్టుల అరెస్టు ప్రభుత్వానికి మంచిది కాదు.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలి

Next Story