ఆదర్శ నియోజకవర్గంగా మునుగోడును తీర్చిదిద్దుతా

by Ratna Kumari |

మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ఆదర్శ నియోజకవర్గంగా మునుగోడును తీర్చిదిద్దుతా
X

దిశ, మునుగోడు : మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కోతులారం గ్రామంలో కోతులారం–కొంపల్లి గ్రామాల మధ్య రూ.19.50 కోట్ల వ్యయంతో 6.2 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ రహదారి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన మునుగోడు చేనేత సహకార ఉత్పత్తి, క్రయవిక్రయ సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమని, యాంత్రిక మగ్గాల వినియోగం పెరగడంతో సంప్రదాయ చేనేత కార్మికులు ఉపాధి సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. పని దొరికినా తగిన ఆదాయం లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రాకముందే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నేత కార్మికుల రుణమాఫీ కోసం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని అన్ని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, విడతల వారీగా పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, కోతులారం సర్పంచ్ జగన్, మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి-నరసింహ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, కాంగ్రెస్ నాయకులు వట్టికోటి శేఖర్, బూడిద లింగయ్య యాదవ్, జాల వెంకన్న యాదవ్, అనంత స్వామి గౌడ్, మక్కెన అప్పారావు, జంగిలీ నాగరాజు, ఆనగంటి కృష్ణ, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story