- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు షేక్ మహబూబ్‌కు జిల్లా కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది.

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు షేక్ మహబూబ్‌కు జిల్లా కోర్టు జీవిత కారాగార శిక్ష విధించింది. హత్య నేరంతో పాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు శవాన్ని దాచిపెట్టిన నేరానికి అదనంగా ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను కూడా ఖరారు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు మిర్యాల పోషవ్వ గోసంగి (50) ఆర్మూర్ మండలం గోవిందపేట గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉండేది. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లికి చెందిన షేక్ మహబూబ్ తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు. గత ఏడాది జనవరి 30న మృతురాలి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
దర్యాప్తులో నిందితుడు షేక్ మహబూబ్‌ను అరెస్టు చేసి, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన జిల్లా జడ్జి జివిఎన్. భారతలక్ష్మి నిందితుడి నేరం రుజువైందని నిర్ధారించారు. దీంతో హత్య నేరానికి జీవిత కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా, శవాన్ని దాచిపెట్టి సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించిన నేరానికి అదనంగా ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు మరో రూ.1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో పి.సత్యనారాయణ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రాజేశ్వర్ రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారి ఎస్‌ఐ గోవిందు, కోర్టు డ్యూటీ అధికారులు ఎం.గంగాధర్, టి.సుభాష్, కె.నారాయణ, శ్రీనివాస్‌లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అభినందించారు.






