రెబ్బెన మండలంలో భారీ నుంచి అతిభారీ వర్షం

by Jakkula.Mamatha |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది.

రెబ్బెన మండలంలో భారీ నుంచి అతిభారీ వర్షం
X

దిశ,రెబ్బెన: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామపంచాయతీల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం కొంత మేర అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంలోని అండర్‌పాస్‌లు, వంతెనల కింద వర్షపు నీరు నిల్వ ఉండటంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు ఉన్న స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా వర్షపు నీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల సమీపంలోనే మధ్యాహ్న భోజన వంటశాల ఉండటంతో నిల్వ నీటి వల్ల దోమలు పెరిగి విద్యార్థులకు అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, సోయాబీన్, వరి తదితర పంటలకు ఈ వర్షాలు ప్రయోజనకరంగా మారాయని రైతులు చెబుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ప్రాంతాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Next Story