మహేశ్వరం గురుకులంలో దయనీయ పరిస్థితులు

by Batti.Sumithra |

మహేశ్వరం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక సుమారు 700 మంది విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేరెంట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

మహేశ్వరం గురుకులంలో దయనీయ పరిస్థితులు
X

దిశ, ఇబ్రహీంపట్నం: మహేశ్వరం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక సుమారు 700 మంది విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేరెంట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థినుల విద్య, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం సమర్పించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సందర్భంగా పేరెంట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. వందలాది మంది విద్యార్థినులు అత్యంత ఇరుకైన భవనంలో చదువుకోవడంతో పాటు అదే గదుల్లో నివసించాల్సి వస్తోందన్నారు. దీంతో చదువుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలిపారు. ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని, బెడ్లు, దుప్పట్లు, ప్లేట్లు వంటి నిత్యావసర వస్తువులు కూడా సరిపడా అందుబాటులో లేవని పేర్కొన్నారు. అలాగే మరుగుదొడ్లు తగిన సంఖ్యలో లేకపోవడంతో పాటు, ఉన్నవి కూడా వినియోగానికి అనుకూలంగా లేకపోవడం వల్ల విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భవనంలో కనీస మౌలిక వసతులైన లైట్లు, ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని, బట్టలు ఉతకడానికి, ఆరేయడానికి కనీస స్థలం కూడా లేదన్నారు. అలాగే ఆటలు ఆడుకునేందుకు, ఉదయం ప్రార్థనలు నిర్వహించేందుకు ప్రత్యేక స్థలం లేకపోవడం విద్యార్థినుల సమగ్ర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. వందలాది మంది బాలికలు నివసిస్తున్న భవనంలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేకపోవడం ఆందోళనకరమని, విద్యార్థినుల భద్రత కోసం తగిన సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియమించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే విశాలమైన, సురక్షితమైన భవనాన్ని కేటాయించాలని, మరుగుదొడ్లు, తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలని, విద్యార్థినులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బెడ్లు, దుప్పట్లు, ప్లేట్లు తదితర సామగ్రిని అందించాలని కోరారు. అలాగే ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు అమలు చేసి భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, ఆటస్థలం, ప్రార్థనా స్థలం ఏర్పాటు చేసి విద్యార్థినులకు మెరుగైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థినుల భవిష్యత్తు, ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి తక్షణ చర్యలు చేపట్టాలని పేరెంట్ కమిటీ కోరింది.

Next Story