- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sajjanar Vs BRS: సజ్జనార్ ట్వీట్‍కు హరీశ్ రావు కౌంటర్.. అసలేం జరిగిందంటే?
మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ పూర్తయ్యాక సజ్జనార్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వి.సి సజ్జనార్ (V.C. Sajjanar) పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర కేడర్‍లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా అనేక కీలక బాధ్యతలను నిర్వర్తించిన ఆయన ప్రజల మనసులలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించిన కేసులో జరిగిన ఎన్ కౌంటర్లు ఆయన్ను ప్రజల హృదయాల్లో హీరోను చేశాయి. అంతటి పేరు సంపాదించుకున్న సజ్జనార్ ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకుంటున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సీపీగా, రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుకు సంబంధించిన సిట్‍కు చీఫ్‍గా ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా సజ్జనార్‍పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పార్టీ శ్రేణులతో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు సైతం సజ్జనార్ తీరును తప్పుబడుతున్నారు. ఈ సీనియర్ ఐపీఎస్ పై ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ కారణంగా మారింది.
చిచ్చు పెట్టిన కేసీఆర్ విచారణ:
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) నిన్న మాజీ సీఎం కేసీఆర్‍ను (KCR) సిట్ విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణ ముగిసిన అనంతరం సిట్‍కు చీఫ్‍గా ఉన్న సజ్జనార్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా నుంచి ఓ పోస్టు చేశారు. 'అక్రమ ఫోన్ ట్యాపింగ్‍కు సంబంధించిన కేసులో గజ్వెల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును సిట్ ప్రశ్నించడం పూర్తయింది' అని పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. సజ్జనార్ చేసిన ట్వీట్‍లో కేసీఆర్‍ను ‘గారు’ అని సంబోధించలేదని అలాగే ప్రతిపక్ష నేత అనే ఆయన హోదాని విస్మరించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
అక్రమమని మీరెలా నిర్ణయిస్తారు: హరీశ్ రావు
సజ్జనార్ తన పోస్టులో ‘అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు’ అని పేర్కొనడంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సీరియస్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది విచారణ పూర్తయి కోర్టులు నిర్ణయించక ముందే మీరెలా నిర్ణయిస్తారని మండిపడ్డారు. ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ కు విరుద్ధంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారని ఈ కేసు విషయంలో సిట్ చీఫ్ ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హరీశ్ రావు ఓ పోస్టు చేశారు. విచారణ దశలోనే ఏ చర్యనైనా అక్రమమని తేల్చే అధికారం సిట్‍కు లేదని భారత టెలిగ్రాఫ్ చట్టం, సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ఆధారంగా మాత్రమే ఏ ఫోన్ ఇంటర్ సెప్షన్ చట్టబద్ధమా లేదా అక్రమమా అనేది నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. రాజకీయంగా సున్నితమైన అంశంలో విచారణ పూర్తి కాకముందే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రేరణ లేదా పక్షపాత దర్యాప్తు జరుగుతోందనే అనుమానాలకు తావిస్తోందన్నారు. విచారణ పూర్తి కాకముందే దోషి అన్న భావన కలిగించే భాష వాడితే అది ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తుంది, న్యాయ పాలనపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. అధికారిక పోలీసు ప్రకటనలు రాజకీయ కథనాలకు వేదిక కావద్దని ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించకూడదన్నారు. సిట్ చీఫ్‍గా వ్యవహరిస్తున్న సజ్జనార్ కేసీఆర్ ను ప్రతిపక్ష నేతగా ఎందుకు గుర్తించడానికి ఎందుకు ముందుకు రావడం లేదో తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని ప్రశ్నించారు.
వరుస వివాదాలు:
గతంలో ఎక్కడ పని చేసినా తనదైన మార్క్ చూపిన సజ్జనార్ అంతే స్థాయిలో ప్రజల చేత జేజేలు పలికించుకున్నారు. అయితే ఇటీవల ఆయనపై వస్తున్న వరుస విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మొన్నటికి మొన్న ఓ ప్రముఖ న్యూస్ చానల్ జర్నలిస్టుల అరెస్టుల విషయంలో ఆయన మాట్లాడిన మాటలు చర్చనీయాశంగా మారాయి. ఆ సమయంలో సజ్జనార్ వ్యాఖ్యలను పలువురు జర్నలిస్టులు, రాజకీయ నేతలు ఆక్షేపించారు. ఈ వ్యవహారం ముగిసిపోగా తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విషయంలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్‍గా ఉన్న సజ్జనార్ పేరు కాంట్రవర్సీగా ఎందుకు మారుతోందనే చర్చ గుప్పుమంటోంది. మరి బీఆర్ఎస్ చేస్తున్న తాజా ఆరోపణల పట్ల సజ్జనార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
Read More..






