ముస్తాఫిజుర్‌పై బీసీసీఐ వేటు .. సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

by Harish |   (  Updated:2026-01-04 14:48:02  IST  )

ముస్తాఫిజుర్‌పై బీసీసీఐ వేటు .. సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
X

దిశ, స్పోర్ట్స్ : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ జట్టు తమ లీగ్ దశ మ్యాచ్‌లను భారత్‌లోనే ఆడనుంది. అయితే, భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్-2026 నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టు నుంచి ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలని ఐసీసీని సంప్రదించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆటగాళ్ల భద్రతను దృష్టి పెట్టుకుని వేదికలను మార్చాలని ఐసీసీని కోరనున్నట్టు బీసీబీ అధికారి ఒకరు తెలిపారు. ‘ముస్తాఫిజుర్ అంశంపై నేను కామెంట్ చేయను. ఎందుకంటే అది వారి అంతర్గత విషయం. కానీ, టీ20 వరల్డ్ కప్ అనేది ఐసీసీ ఈవెంట్. ఐసీసీతో వీలైనంత త్వరగా బీసీబీ చర్చిస్తుంది. గతేడాది చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడానికి నిరాకరించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది.’అని సదరు అధికారి తెలిపారు. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం.. బంగ్లా జట్టు లీగ్ దశలో కోల్‌కతాలో ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో, 17న ముంబైలో నేపాల్‌తో తలపడనుంది.

READ MORE ....

టీ20 ప్రపంచకప్‌కు బంగ్లా జట్టు ఎంపిక.. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు చోటు

శ్రీలంక‌లో బంగ్లా మ్యాచ్ లు ? బీసీసీఐ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న !

Next Story