న్యూజిలాండ్.. కరోనా ఫ్రీ లాండ్

by  |
న్యూజిలాండ్.. కరోనా ఫ్రీ లాండ్
X

వెల్లింగ్‌టన్: ప్రపంచమంతా కరోనా వైరస్‌తో వణికిపోతుంటే న్యూజిలాండ్ ఈ మహమ్మారిని విజయవంతంగా పారదోలింది. 17 రోజుల నుంచి ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ, గతపది రోజులుగా ఆక్‌లాండ్‌కు చెందిన ఓ మహిళా పేషెంట్‌లో మాత్రం వైరస్ యాక్టివ్‌గా ఉంది. కాగా, 48 గంటలుగా ఆమెలో వైరస్ లక్షణాలు కనిపించలేదని, ఇప్పుడామే వైరస్ నుంచి కోలుకున్నారని సోమవారం దేశ వైద్యారోగ్య అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ కరోనా రహిత దేశమని వెల్లడించారు. దీంతో దేశీయంగా అమలు చేస్తున్న ఆంక్షలన్నీ ఎత్తేస్తున్నట్టు ప్రధాని జెసిండా అడర్న్ ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ సరిహద్దులపై ఆంక్షలను కొనసాగిస్తున్నది. అయితే, పొరుగుదేశాల్లో ఉన్న న్యూజిలాండర్‌లు స్వదేశానికి వచ్చే వెసులుబాటు కల్పించనున్నట్టు తెలిపింది. అయితే వారు కూడా ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్‌లలో 14 రోజులు గడపాల్సి ఉంటుంది. వైద్యారోగ్య అధికారులు ప్రస్తుతం దేశంలో ఒక్క కరోనా యాక్టివ్ కేసు(గుర్తించిన) లేదని ప్రకటించగానే, ప్రధాని జెసిండా అడర్న్ అమితానందాన్ని వ్యక్తపరిచింది. ఈ వార్త వినగానే తన కూతురితో కలిసి డ్యాన్స్ చేసినట్టు తెలిపారు. ఎందుకు డ్యాన్స్ చేస్తున్నానో తెలియక కూతురు తికమకపడిందని చెప్పుకొచ్చారు. ‘50 లక్షల మందిగల మన టీమ్ సక్సెస్ అయింద’ని వ్యాఖ్యానించారు. న్యూజిలాండ్ 50 లక్షల మంది జనాభాను ఆమె టీమ్‌గా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ టీమ్ ఏకమై అద్వితీయ పోరాటం చేసిందని, అసమానంగా పోరాడి వైరస్‌ను నలిపేసిందని అడర్న్ అన్నారు. సోమవారంరాత్రి నుంచి న్యూజిలాండర్లు స్వేచ్ఛా వాతావరణంలో ఉంటారని, ఎలాంటి ఆంక్షలు, సామాజిక దూరంలాంటి నిబంధనలు లేకుండా విహరించవచ్చని ప్రకటించారు. దేశంలో నిలిచిపోయిన అన్ని రకాల పనులు, ఆర్థిక కార్యకలాపాలు పున:ప్రారంభించు కోవచ్చని చెప్పారు. అయితే, ఈ వైరస్‌పై పోరు ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. వైరస్ మళ్లీ దేశంలోకి ప్రవేశించవచ్చని, అంతమాత్రాన న్యూజిలాండర్లు ఓడిపోయినట్టు కాదని వివరించారు. ఇదే వైరస్ లక్షణమని తెలిపారు. కాగా, ఆంక్షల ఎత్తివేతపై పీఎం జెసిండా అడర్న్ ప్రకటనతో దేశవాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఆప్తుల చెంత కూర్చోవచ్చని, ఆలింగనం చేసుకోవచ్చని, కలిసి బయటకెళ్లొచ్చని.. ఇలా తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే, కొందరు ముందు జాగ్రత్తగా ఇప్పటికీ కొన్ని నిబంధనలు పాటిస్తామని ప్రకటించుకున్నారు. మరికొందరైతే ఇక తాము తమ ముఖాన్ని చేతులతో ముట్టుకోవచ్చని సంబురపడ్డారు.

ఈ దేశంలో సుమారు 200 కేసులు నమోదైన సమయంలో మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించారు. నాలుగు వారాల కఠిన ఆంక్షల అమలు తర్వాత విడతలవారీగా సడలింపులు చేసుకొచ్చారు. 200 దగ్గర మొదలైన కేసులు గరిష్టంగా 1,500లకు చికిత్స అందించేవరకు చేరాయి. కేవలం 20 మంది మాత్రమే ఈ వైరస్‌తో మరణించారు. ఈ లాక్‌డౌన్ కాలంలో న్యూజిలాండర్లు ఎంతో నిబద్ధతతో ప్రభుత్వ ఆదేశాలను పాటించారు. మెజార్టీ ప్రజలు ఇల్లు కదల్లేదు. దీంతో ఇప్పటికే కరోనా రహిత దేశాల జాబితాలో న్యూజిలాండ్ చేరింది.

కరోనా ఫ్రీ కంట్రీస్ ఇవి..

అమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యాలు రోజుకు సుమారు పది వేల నుంచి 30 వేల కేసులు రిపోర్ట్ చేస్తున్న సందర్భంలో కొన్ని దేశాలు మాత్రం తమ దేశంలో కరోనా లేదని ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా లేదని ప్రకటించిన కొన్ని దేశాల జాబితాను పరిశీలిద్దాం.

మాంటెనెగ్రో: మార్చి 17న తొలి కేసు నమోదుచేసుకున్న మాంటెనెగ్రో దేశం మే 24న కరోనా రహితంగా ప్రకటించుకుంది. కరోనా ఫ్రీగా ప్రకటించుకున్న తొలి యూరోపియన్ కంట్రీ ఇదే కావడం గమనార్హం. ఈ దేశంలో మొత్తం కేసులు 324కు చేరాయి. ప్రస్తుతం ఈ దేశంలో ఒక్క కరోనా యాక్టివ్ కేసు లేదని ఆ దేశం ప్రకటించింది.

ఎరిత్రియా: తూర్పు ఆఫ్రికా దేశమైన ఎరిత్రియా మే 15న తమ దేశంలో ఒక్క కరోనా యాక్టివ్ కేసూ లేదని ప్రకటించింది. 60 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో 39 కరోనా కేసులు నమోదయ్యాయి. నార్వే నుంచి తిరిగొచ్చిన ఓ దేశవాసికి మార్చి 21న కరోనా పాజిటివ్ అని తేలగా, ఏప్రిల్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.

పాపువా న్యూగినియా: 89 లక్షల జనాభా గల పసిఫిక్ నేషన్ పాపువా న్యూగినియాలో తొలి కేసు మార్చి 20న వెలుగుచూసింది. దీంతో ఆసియా దేశాలు, ఇండోనేషియా నుంచి సరిహద్దులను మూసింది. దేశీయంగానూ కఠిన నిబంధనలు అమలు చేసింది. ఈ దేశంలో మొత్తం కేసులు ఎనిమిది మాత్రమే. కాగా, మే 4న కరోనా ఫ్రీ కంట్రీగా పాపువా న్యూగినియా ప్రకటించింది.

మరికొన్ని దేశాలు: సియాషెల్స్‌లో రిపోర్ట్ అయిన 11 కేసులు రికవరీ అయ్యాయి. తొలి రెండు కేసులు మార్చి 14న వెలుగుచూశాయి. రోమ్ పరిధిలో ఉండే హోలీ సీలో నమోదైన 12 కేసులు రికవరీ అయ్యాయి. దీంతో జూన్ 6న కరోనారహిత ప్రదేశంగా ప్రకటించింది. వెస్ట్ ఇండీస్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ తొలి కేసు మార్చి 24న రిపోర్ట్ అయింది. ఈ దేశంలోని మొత్తం 15 కేసులు రికవరీ కావడంతో మే 19న కరోనా రహిత దేశంగా మారింది. మార్చి 19న తొలి కేసు నమోదైన ఫిజి ఏప్రిల్ 20లోపే కరోనా రహితంగా ప్రకటించుకుంది. ఈ దేశంలో మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. నైరుతి ఆసియా దేశం ఈస్ట్ తిమోర్‌లో తొలి కేసు మార్చి 21న వెలుగుచూడగా, ఆంక్షలు విధించింది. దేశంలోని మొత్తం 24 కేసులు రికవరీ కావడంతో మే 15న కరోనా రహిత దేశంగా ప్రకటించుకుంది.

Next Story

Most Viewed