అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న జిల్లా బాస్.. తప్పు చేసేది ఒకరు.. బలయ్యేది మరొకరు?

by srinivas |
అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న జిల్లా బాస్..  తప్పు చేసేది ఒకరు.. బలయ్యేది మరొకరు?
X

దిశ, నల్గొండ బ్యూరో: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరులో ఉపాధి హామీ పనుల్లో చేతివాటం చూపిస్తున్నారు. మస్టర్లలో ఇష్టమొచ్చిన ఫోటోలు, పనికి రాని కూలీలకు హాజరు వేస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఇటీవల సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ పనులను పంచాయతీ కార్యదర్శి చూసుకుంటున్నారు. అయినా అవకతవకలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామస్థులు జిల్లా బాస్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. గుంజలూర్‌లో జరిగిన ఉపాధి హామీ అక్రమాలపై జిల్లా కలెక్టర్, డీఆర్‌డీ‌వో మాత్రం ఏపీవోకు మాత్రమే మెమో జారీ చేశారు. కానీ ఎలాంటి నోటీస్‌లు ఇవ్వలేదు. దీంతో కార్యదర్శిని కాపాడుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

అయితే ఈ వ్యవహారమంతా ఓ ప్రైవేటు వ్యక్తి నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన వెనుక జిల్లా బాస్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రైవేట్ వ్యక్తినే గుంజలూరు ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్ చేయడం వెనుక, ప్రస్తుతం ఆ గ్రామ కార్యదర్శిని కాపాడడం వెనుక, మండలంలోని ఓ టెక్నికల్ అసిస్టెంట్, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా బాస్‌తోనే నేరుగా సంబంధాలు పెట్టుకొని తన ఇష్టానుసారంగా పనులు చేయించుకున్నట్లు సమాచారం. ఆ వ్యక్తికీ జిల్లా అధికారులందరూ దాసోహమై అండలేని కొందరిపై చర్యలు తీసుకుంటున్నారని జిల్లా అధికారులు గుసగుసలాడుతున్నారు.

ఓ ప్రైవేట్ వ్యక్తి అంటే జిల్లా బాస్‌కు హడల్?

ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఏపీవోకి మాత్రమే షోకాజ్ నోటీస్‌లు, మెమోలు అందడం అందజేసినట్లు సమాచారం. ఈ నోటీసులు అందడం వెనుక ప్రైవేట్ వ్యక్తి హస్తముందని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ తర్వాత, ఉపాధి హామీని పర్యవేక్షించాల్సింది పంచాయతీ కార్యదర్శి. కానీ మండలంలో మొత్తం ఉపాధి హామీ పనులను పర్యవేక్షించే ఏపీఓకు నోటీస్‌లు మెమోలు కుట్ర పూరితంగా అందజేసినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే గ్రామస్థాయిలో పని చేసే టెక్నికల్ అసిస్టెంట్, ఈసీ, ఆ గ్రామ కార్యదర్శికి కూడా నోటీసులు మాత్రం రాలేదని సమాచారం. ఈ ముగ్గురు ఉద్యోగులు ఓ ప్రైవేటు వ్యక్తికి బాగా కావాల్సినవాళ్లు. ప్రైవేట్ వ్యక్తి ఏకంగా జిల్లా బాసును ప్రభావితం చేయగలిగే సామర్థ్యం కలిగిన వారు. అందుకే ఆయన ప్రభావంతోనే ఏపీవోకు నోటీసులు అందించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని స్వయంగా టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ కార్యదర్శి, ఈసీ ముగ్గురు బాహాటంగా తమ సన్నిహితుల మధ్య పేర్కొన్నట్లు తెలుస్తోంది.

జిల్లా బాస్ అండతో 58, 59 జీవో కిం 4 ప్లాట్లు రిజిస్ట్రేషన్

జిల్లా అధికారుల అండదండలతో ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో సుమారు 4 ప్లాట్లను అప్పటి తహసీల్దార్‌ను బెదిరించి 58, 59 జీఓ క్రింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నాలుగు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లలో అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని సమాచారం. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో ప్రస్తుతం ఆత్మకూరు (ఎస్ )మండలంలో ఓ తండాకు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న ఉద్యోగికి కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు 58, 59 జీవోలు చెల్లుబాటు కావని తెలిసిందే. అయినప్పటికీ జిల్లా బాస్ సహకారంతో ఈ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు.

తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ ఉంది ఇలా…

తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారం జాతీయ ఉపాధి హామీ పనిని గ్రామపంచాయతీ కార్యదర్శి నిత్యం పర్యవేక్షించాలని ప్రభుత్వం సర్క్యులర్ 39/egs/admin./2021, 03.04.2021 జారీ చేయడం జరిగింది. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనిలో జరిగే ప్రతి అవినీతిలో ప్రతి అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకమని ఈ సర్కులర్లో ఉంది. అయినప్పటికీ జిల్లా అధికారులు అక్రమాలకు వారికి నోటీసులు ఇవ్వకుండా డిపార్ట్మెంట్కు సంబంధం లేని ఓ వ్యక్తికీ భయపడి ఫీల్డ్ అసిస్టెంట్ ‌ను సస్పెండ్ చేయడం, స్థానిక ఏపీఓపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అతనికి షోకాజ్ నోటీసులు, మెమోలు ఇప్పించాడనే ఆ శాఖ ఉద్యోగులే అదే శాఖ ఉన్నతాధికారులపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. జిల్లా పరిపాలన అధికారిగా ఉండి కొంతమంది అధికారులపై చవితి తల్లి ప్రేమ చూపించడం, మరి కొంతమంది అధికారులను సొంత అధికారులుగా భావించడం భావ్యమేనా అని, జిల్లా అధికారిగా ఉన్నత పదవి అనుభవిస్తున్న తనకు ఇది తగునా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Next Story