ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్

by samatah |
ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్ అని బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. పాట్నాలో తేజస్వీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతుందని, అందుకే మూడు-నాలుగు రౌండ్ల ఓటింగ్ తర్వాత తమకు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించడానికి ప్రశాంత్‌ను పిలిచారని తెలిపారు. అమిత్ షా కోరిక మేరకు ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు నితీశ్ కుమార్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు అమిత్ షా, ప్రశాంత్ కిషోర్ లు ఈ వాదనను ఖండించలేదని చెప్పారు. దీనిని బట్టి చూస్తే బీజేపీ మొదటి నుంచి బీజేపీలోనే ఉన్నారని అర్థమవుతోందన్నారు. ఆయన ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని ఎద్దేవా చేశారు.

‘ప్రశాంత్‌కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అతను ప్రతి ఏటా వివిధ వ్యక్తులతో కలిసి పని చేస్తూనే ఉంటాడు. పని చేస్తున్న వారి దగ్గరి నుంచి డేటా సేకరించి మరొకరికి ఇస్తాడు. ఆయన కేవలం బీజేపీ ఏజెంట్ మాత్రమే కాదు, కాషాయపార్టీ మనస్తత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. వారి సిద్ధాంతాలను అనుసరిస్తాడు. బీజేపీ వ్యూహంలో భాగంగానే ప్రశాంత్‌కు నిధులు వస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికలకు నెలల ముందు కిషోర్ జేడీయూలో చేరారు, అయితే 2020లో పౌరసత్వ సవరణ చట్టంపై పార్టీ వైఖరిపై ఆయన చేసిన విమర్శల కారణంగా ఆయనను జేడీయూ నుంచి బహిష్కరించారు.

Next Story

Most Viewed