రేషన్ షాపుల్లో విస్కీ, బీర్ సేల్స్.. లోక్‌సభ అభ్యర్థి విచిత్ర హామీ

by Dishanational4 |
రేషన్ షాపుల్లో విస్కీ, బీర్ సేల్స్.. లోక్‌సభ అభ్యర్థి విచిత్ర హామీ
X

దిశ, నేషనల్ బ్యూరో : తాను ఎంపీగా ఎన్నికైతే పేదలకు సబ్సిడీపై విస్కీ, బీర్ అందిస్తానని స్వతంత్ర అభ్యర్థి వనితా రౌత్ ప్రకటించారు. ఇందుకోసం ఎంపీ ఫండ్‌ నుంచి నిధులను కేటాయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతినెలా రాయితీపై విస్కీ, బీర్లను అందిస్తే బాగుంటుందని మహారాష్ట్రలోని ‘చంద్రపూర్ - వాణి - ఆర్ని’ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న వనితా రౌత్ అభిప్రాయపడ్డారు. కనీసం ప్రతి ఏడాది దీపావళి పండుగ సందర్భంగానైనా రేషన్ కార్డుదారులకు విస్కీ, బీర్లను అందించాలన్నారు. మద్యం సేవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఆల్ ఇండియా హ్యుమానిటీ పార్టీ మద్దతు పలికిందని ఆమె తెలిపారు. వనితా రౌత్.. సిందేవాహి తాలూకాలోని పెంధారి గ్రామవాసి. ఆమె 2019లో నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి చిమూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మద్యపానంపై నిషేధాన్ని తొలగించాలనే డిమాండ్‌తో అప్పట్లో ఎన్నికల్లో వనిత పోటీ చేశారు. తాను గెలిస్తే ప్రతి గ్రామంలోని నిరుద్యోగ యువతకు మద్యం లైసెన్స్‌లు అందిస్తానని ఆనాడు హామీ ఇచ్చారు. కనీసం ఈసారి ఎన్నికల్లోనైనా మందుబాబులు ఆమెకు అనుకూలంగా ఓటు వేస్తారో లేదో వేచిచూడాలి.

Next Story