‘విజయ్‌కి మద్దతిస్తూనే’.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-07 10:49:41  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘విజయ్‌కి మద్దతిస్తూనే’.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని 'హంగ్' పరిస్థితి ఏర్పడటాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో, అత్యధిక స్థానాలు (108 సీట్లు) సాధించిన నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇలాంటి అనిశ్చిత ఫలితం రావడం ఇదే మొదటిసారి అని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీని ప్రజలు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు విషయంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు (గవర్నర్) ప్రజల తీర్పును గౌరవించాలని ఆయన కోరారు. ఇది తన వ్యక్తిగత డిమాండ్ కాదని, రాజ్యాంగపరమైన బాధ్యతను గుర్తు చేయడం మాత్రమేనని కమల్ వివరించారు.

విజయ్ పార్టీకి అవకాశం ఇవ్వాలి..

108 స్థానాలను గెలుచుకున్న విజయ్ పార్టీని విస్మరించడం ప్రజల మెండెంట్ (తీర్పు)ను అగౌరవపరచడమేనని ఆయన అన్నారు. శాసనసభలో బలాబలాల పరీక్ష జరగాలే తప్ప, రాజ్‌భవన్‌లో నిర్ణయాలు తీసుకోకూడదని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని ప్రకటించిన డీఎంకే (DMK) నేత ఎంకే స్టాలిన్ నిర్ణయాన్ని కమల్ హాసన్ ప్రశంసించారు. ప్రస్తుత సున్నిత పరిస్థితుల్లో ఇది రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని కొనియాడారు. గెలిచిన 233 మంది ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకపోవడంపై కమల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాప్యం రాష్ట్రానికి అవమానకరమని, ప్రజాస్వామ్య పనితీరుకు విఘాతమని ఆయన విమర్శించారు. "నేను మాట్లాడుతున్నది రాజకీయాలు కాదు.. ఒక భారతీయ పౌరుడిగా నా ఆవేదన. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పుకు పూర్తి రాజ్యాంగ గౌరవం దక్కాలి" అని కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

ఆటో డ్రైవర్ కాదు కోటీశ్వరుడు.. టీవీకే ఎమ్మెల్యే బండారం బట్టబయలు

అధికారంలో భాగస్వామ్యం ఇస్తాం.. వామపక్షాలకు టీవీకే బంపరాఫర్

Next Story