- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుణ్యం వస్తుందనే ఆ కులాల స్త్రీలపై అత్యాచారాలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మహిళల భద్రత రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. నిత్యం ఎక్కడో చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దారుణాలను కట్టడి కోసం ప్రయత్నించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలకు కులాన్ని అంటగట్టి అత్యంత జుగుప్సాకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‍లోని (Madhya Pradesh)భాండేర్ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్యా (MLA Phool Singh Baraiya) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఇందుకు వారిని సంభోగిస్తే తీర్థయాత్రలకు వెళ్లినంత ఫుణ్యం దక్కుతుందనే నమ్మకం మతపరమైన గ్రంథాల్లో ఉండటమే కారణం అని ఆయన అన్నారు.
వారు అందంగా ఉండరు కానీ..
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మహిళలు అందంగా ఉండరు. కానీ ఫలానా కులానికి చెందిన స్త్రీతో సంభోగం చేస్తే నీకు తీర్థయాత్రలకు వెళ్లినంత పుణ్యం లభిస్తుందని గ్రంథాలలో రాయబడి ఉంది. ఒక వ్యక్తి తీర్థయాత్రకు వెళ్లలేక పోతే ప్రత్యామ్నాయం ఏమిటి? వారితో సంభోగం చేస్తే నీకు ప్రతిఫలం లభిస్తుందని గ్రంథాల్లో ఉంది కాబట్టి ఆ వర్గాలకు చెందిన స్త్రీలను లాక్కెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు. బహుమతి కోసం వారు అలా అత్యాచారాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు తరచుగా వ్యక్తుల కంటే సమూహాల ఆధారంగా జరుగుతాయన్నారు. అందమైన అమ్మాయి కనిపిస్తే పురుషుడి మనస్సు చలించిపోయి అత్యాచారానికి పాల్పడే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. బరయ్యా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. దీంతో ఆయన మాటలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రాజకీయ దుమారం:
కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‍లో రాజకీయ దుమారం చెలరేగింది. బరయ్యా వ్యాఖ్యలపై బీజేపీతో పాటు కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ పర్యటన నేపథ్యంలో బరయ్య వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నిజమైన సిద్ధాంతమా? అంటూ బీజేపీ ప్రశ్నించింది. బరయ్యా నుంచి తక్షణం క్షమాపణలు చెప్పించి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. లేదా ఈ ఆలోచనలతో కాంగ్రెస్ ఏకీభవిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. బరయ్యా చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైన, వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ ఆశిష్ అగర్వాల్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు నోరు జారడం వల్ల వచ్చినవి కాదని వారి నిజమైన సిద్ధాంతానికి నిదర్శనం అని విమర్శించారు. మహిళలను 'అందం' అనే స్థాయిలో తూకం వేయడంతో పాటు దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల మహిళలపై జరిగే దారుణమైన నేరాలను పవిత్ర చర్యగా వర్ణించడం మానవత్వంపై ప్రత్యక్ష దాడి దుయ్యబట్టారు. ఇక ఆల్ ఇండియా బ్రాహ్మణ సొసైటీ నేత పండిత్ పుష్పేంద్ర మిశ్రా స్పందిస్తూ బరయ్య వ్యాఖ్యలను ఖండించారు. ఆయన ఎలాంటి నీచ బుద్ధితో ఉన్నారో ఆయన మాటలను బట్టి అర్థం అవుతోందని మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు:
ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ స్పందిస్తూ.. పార్టీకి ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అత్యాచారాన్ని ఏ విధంగానూ సమర్థించలేమని, అత్యాచారం చేసే వ్యక్తి ఎవరైనా నేరస్థుడేనని దీనిని కులం, మతంతో అంటగట్టడం పూర్తిగా తప్పు అన్నారు.






