అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

by Batti.Sumithra |

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
X

దిశ, రాజేంద్రనగర్ : అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో అనిరుద్ స్కూల్ సమీపంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుధాకర్ నివాసం ఉంటున్నాడు. 11 సంవత్సరాల క్రితం స్వాతి అనే మహిళతో సుధాకర్‌కు వివాహం జరిగింది. ఐదేళ్ల పాటు ఇరువురి సంసారం సాఫీగానే సాగింది. అనంతరం ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో భార్యాభర్తలు వేరువేరుగా ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉంది. ఆమె స్వాతితోనే ఉంటుంది. సుధాకర్ ఒక్కడే బండ్లగూడలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 18వ తేదీన పడుకున్న చోటే అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందాడు. సోమవారం సుధాకర్ తండ్రి శ్రీనివాస్ ఫోన్ చేయగా, సుధాకర్ స్పందించలేదు. దీంతో అతని స్నేహితుడికి సమాచారం అందించాడు. స్నేహితుడు వచ్చి చూడగా సుధాకర్ మృతి చెంది ఉన్నాడు. స్నేహితుడి సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుధాకర్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక సమాచారంలో తెలిసింది. గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story