కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులకు చోటు : విదేశాంగ మంత్రి జైశంకర్

by Dishanational2 |
కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులకు చోటు : విదేశాంగ మంత్రి జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థాన్ మద్దతు దారులకు కెనడాలో చోటు కల్పించారని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడానికి అదే కారణమైందని తెలిపారు. మంగళవారం ఆయన ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కెనడా తీసుకున్న నిర్ణయాలు ఏ దేశానికి ఉపయోగకరంగా లేవన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు కెనడాలోని ఖలిస్తానీ సమస్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘కెనడా సమస్య కొత్తది కాదు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాబ్లమ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుంది’ అని చెప్పారు. కెనడాలోని ఖలిస్థాన్ మద్దతు దారులు భారత దౌత్య వేత్తలపై బెదిరింపులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. దీనివల్ల భారత్- కెనడాల మధ్య దౌత్య సంబంధాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయన్నారు. కాగా, గతేడాది కెనడాలో ఖలిస్థానీ నేత నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ట్రూడో వ్యాఖ్యలను భారత్ సైతం తీవ్రంగా ఖండించింది. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని తెలిపింది.



Next Story

Most Viewed