ఎన్నికల వేళ..ఆ సమయం నుంచి ప్రచారాలు నిలుపుదల:జిల్లా ఎన్నికల అధికారి

by Disha Web Desk 18 |
ఎన్నికల వేళ..ఆ సమయం నుంచి ప్రచారాలు నిలుపుదల:జిల్లా ఎన్నికల అధికారి
X

దిశ ప్రతినిధి,విశాఖ‌ప‌ట్నం:ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం 11వ తేదీ సాయంత్రం 6.00 గంట‌ల నుంచి ప్ర‌చారం నిలుపుద‌ల చేయాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా. ఎ. మ‌ల్లికార్జున అభ్య‌ర్థుల‌కు సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళికి లోబ‌డి వ్య‌వ‌హ‌రించాల‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ స‌జావుగా సాగేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పోలింగ్ ముగియ‌డానికి 48 గంట‌ల ముందు నుంచే సైలెంట్ పిరియ‌డ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని, ఆ స‌మ‌యంలో లౌడ్ స్పీక‌ర్లు ఉప‌యోగించి ఎలాంటి రాజ‌కీయ ప్ర‌చారాలు చేయ‌డానికి వీలులేద‌ని స్ప‌ష్టం చేశారు. 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంటుంది కావున న‌లుగురు కంటే ఎక్కువ మంది తిర‌గ‌డానికి వీలుండ‌ద‌ని గుర్తు చేశారు. దీన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని పోటీ చేయు అభ్య‌ర్థులు జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సూచించారు.

స్థానిక క‌లెక్ట‌రేట్ సమావేశ మందిరంలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో పోటీ చేయు అభ్య‌ర్థుల‌తో శుక్ర‌వారం సాయంత్రం జిల్లా ఎన్నిక‌ల అధికారి ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. పోలింగ్ ముగియ‌డానికి 48 గంట‌ల లోపు సంబంధిత నియోజ‌క‌వ‌ర్గంలో బ‌య‌ట వ్య‌క్తులు ఉండ‌డానికి వీలులేద‌ని స్ప‌ష్టం చేశారు. 72 గంట‌ల కాలంలో పోలీసు బృందాలు, ఎంసీసీ బృందాలు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న లాడ్జిలు, హోట‌ళ్లు, క‌ల్యాణ మండ‌పాలు, ఫంక్ష‌న్ హాళ్లు త‌నిఖీ చేస్తాయ‌ని గుర్తు చేశారు. అనుమానిత వ్య‌క్తులు, బ‌య‌ట వ్య‌క్తులు ఉంటే ఎంసీసీ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి చ‌ర్య‌లు తీసుకుంటార‌ని అభ్య‌ర్థుల‌కు తెలియ‌జేశారు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ సాధార‌ణ ప‌రిశీల‌కులు అమిత్ శ‌ర్మ మాట్లాడుతూ మే 13న పండ‌గ వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ జ‌ర‌గ‌డానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జిల్లా యంత్రాంగం నుంచి ప‌టిష్ట ఏర్పాట్లు చేశార‌ని, ఎన్నిక‌లు విజ‌య‌వంతంగా జ‌రుగుతాయ‌ని విశ్వ‌సిస్తున్నాన‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహ‌న్ కుమార్, ఎన్నిక‌ల విభాగం అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed