ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !

by Aamani |
ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో..  సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !
X

దిశ,అయిజ : రాజకీయ నాయకులు ఎంతో ఆర్భాటంగా తొడిగే ఖద్దరు చొక్కా వెనుక ఇతరులెవ్వరికి తెలియని కన్నీటి బాధలెన్నో ఉన్నాయి. రాజకీయం అనే రంగుల సముద్రంలో ఈదలేక అలసిపోతున్న రాజకీయ ఉద్దండులెందరో ఒడ్డున కూర్చుని వెనక్కి రాలేకా, ముందుకు వెళ్లలేక నిరీక్షిస్తున్న సందర్భాలను మనం సమాజంలో ఎన్నో చూస్తున్నాం. రాజకీయం అంటే అదేదో అద్భుత లోకమని భావించి యాదృచ్చికంగా ఆ రంగంలో ప్రవేశించి తీరా పీకల్లోతు కూరుకుపోయిన తర్వాత కానీ వెనక్కి రాలేమని తెలుసుకొని, మునుపటి జీవితం కోసం నిరీక్షిస్తున్న రాజకీయ బాధితులెందరో మనకు తారసపడతారు. అటువంటి వారి జీవితాల్లోకి తొంగిచూస్తే వారు పంటి బిగువున భరిస్తున్న బాధలెన్నో మనకు తెలుస్తాయి.

జీవితాలు అతలాకుతలం..

రాజకీయ మోజు ఎందరో జీవితాలను అతలాకుతలం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకుడి పరిస్థితి ఏమో కానీ, గ్రామ,మండల,జిల్లా స్థాయిలో రాజకీయం చేసే నాయకుల ఖర్చులు తడిసి మోపెడౌతున్నాయి. సర్పంచ్,ఎంపీటీసీ,ఎంపీపీ, జడ్పీటీసీ,సింగిల్ విండో చైర్మన్, నామినేటెడ్ పదవులు అనుభవించే వారు సైతం సంపాదించేది దేవుడెరుగు కానీ, కొందరు చేస్తున్న అడ్డగోలు ఖర్చులు మాత్రం వారికి గుదిబండలా మారుతున్నాయి. అధికార హోదా, దర్పం కోసం చేస్తున్న ఖర్చులు పెరిగి అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. పదవుల మీద వ్యామోహంతో ఎన్నికల్లో తలపడి కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఈ సందర్భంగా సంసార జీవితాలు అతలాకుతలమైన పట్టించుకోకుండా రాజకీయంలో ముందుకే వెళ్లాల్సిన పరిస్థితులు కొందరికి ఏర్పడుతున్నాయి. ఎన్నికల్లో ఓడిన వారు పెట్టిన ఖర్చు వెనక్కి రాక నష్టపోతే, గెలిచిన వారు హోదా తగ్గకుండా చేసే ఖర్చులతో ఆర్థికంగా నష్టపోతున్నారు.

కారుంటేనే హోదా అనుకుంటున్నారు !

ఒకప్పటి రాజకీయాల్లో ఓ స్థాయికి ఎదిగిన నాయకులే కార్లు మెయింటెన్ చేసేవారు. కానీ నేటి రాజకీయాల్లో ఆ పరిస్థితి లేదు. గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ,ఇతర పదవుల్లో గెలిచిన వెంటనే దర్పం కోసం కార్లు కొంటున్నారు. ఇప్పుడున్న సమాజంలో లక్షో, రెండు లక్షలో చెల్లిస్తే కంపెనీలు వాయిదాల రూపంలో కార్లు ఇస్తున్నారు. ఈ రకమైన వాయిదాలతో కొనుగోలు చేసిన కార్లతో రోజు ఐదు మందిని కారులో ఎక్కించుకుని వారి రోజువారీ ఖర్చులు నాయకుడే భరించటం నేటి రాజకీయాల్లో పరిపాటిగా మారింది. ఏమి లేదన్నా రోజుకు రూ,3 నుంచి 4 వేల వరకు గ్రామస్థాయి నాయకుడికి ఖర్చవుతుంది. ఎంత లేదన్నా నెలకు రాజకీయాల కోసం లక్ష మించకుండా ఖర్చు చేసే నాయకులు ఎందరో ఉన్నారు. ఈ విధంగా ఏడాది మెయింటెన్ చేసేలోపు అనుచర వర్గం ఖర్చులు, కారు కంటూ తడిసి మోపెడై ఇవన్నీ చెల్లించేందుకు చేతిలో చిల్లి గవ్వ లేక ప్రిస్టేజి కోసం పెద్దలు సంపాదించిన ఆస్తిని అమ్మో, తాకట్టు పెట్టో డబ్బులు సర్ది, తెల్లారేసరికి ఖద్దరు ధరించి నిన్నటి లాగే ముఖం మీద చిరునవ్వు చిందించు కుంటూ ప్రజలతో మమేకం అవుతున్న నాయకులు మన కళ్ళముందే ఉన్నారు. మరి కొందరైతే రాజకీయ హోదా తగ్గించుకోలేక, సంపాదన లేక పిల్లల చదువులు, పెళ్లిళ్లు అప్పులు చేసే గొప్పగా చేస్తున్నారు.

రాజకీయాల్లో ఆదాయం ఉంటుందా ?

వాస్తవంగా రాజకీయం అంటే సేవా దృక్పథం. క్రమంగా రాజకీయం ఒక ఫ్యాషన్ గా మారి కోట్ల సంపాదనకు పదవి కేంద్రబిందువుగా ఉందనే భ్రమలో గ్రామీణ నాయకులు,యువకులు మరికొందరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. వాస్తవంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిస్తే కొంత ఆర్థిక అధికారం ఉంటున్నప్పటికీ, లక్షల, కోట్లు మిగిలించుకునే పరిస్థితులు ఇక్కడేమి ఉండవు. ఎంపీటీసీ పదవి అంటావా మండల స్థాయిలో ఎంపీపీని ఎన్నుకునేందుకు అవసరమైన సంఖ్యకు మాత్రమే ఉపయోగపడి ప్రత్యేకాధికారాలంటూ ఏమి ఉండని పదవి ఎంపీటీసీ. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ, ఆర్థిక సంఘం గ్రాంట్ జనాభా ప్రకారం ఒక్కో మనిషికి సగటున ఏడాదికి రూ,1610 చెల్లిస్తుంది.

పంచాయతీకి పన్నుల ద్వారా, రాష్ట్ర గ్రాంట్ ల ద్వారా ఏడాదికి వచ్చే నిధులు రూ,2 లక్షల నుండి రూ,5 లక్షలకు మించవు. ఈ నిధులన్నీ కూడా ప్రత్యేక నిబంధనల ద్వారానే ఖర్చు చేయాల్సి ఉంటుంది తప్ప, ఎన్నికైన సర్పంచ్ ఇష్టప్రకారమేమీ ఖర్చు చేసే అవకాశం ఉండదు. పదవీ కాంక్ష కోసం ఒక పంచాయతీకి ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా వచ్చే రూ,20,30 లక్షల నిధుల కంటే ఎన్నికల కోసం అభ్యర్థి చేసే ఖర్చు మాత్రం రూ,50 లక్షల వరకు ఉంటుందంటే రాజకీయాలు మనిషిని ఆర్థికంగా ఏ స్థాయికి దిగజారుస్తాయో అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.

ఆలోచనా విధానాలు మారాలి..

రాజకీయాల్లో పోటీ చేసే నాయకులతో పాటు వారికి ఓటు వేసే ఓటరు ఆలోచనా విధానం కూడా మారినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. తాజాగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వస్తాయనే ప్రచారం జోరందుకుంది. ఏ ఒక్కరి నోట్లో చూసినా సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎవరు ఎంత ఖర్చు పెడతారో అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఓటుకు నోటు ఆశించకుండా అభివృద్ధి కోసం ఓటు వేస్తామని ఓటరు, తాను గెలిచేందుకు ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురిచేయనని నాయకుడు ప్రతిజ్ఞతో ఎన్నికల కార్యక్షేత్రం లోకి అడుగు పెట్టినప్పుడే అభివృద్ధి పరుగులు తీస్తుంది.ఖద్దరు చొక్కా కన్నీటి వ్యథ పటాపంచలౌతుంది.

Next Story