నా రెండో సంతకం దానిపైనే.. చంద్రబాబు కీలక ప్రకటన

by Disha Web Desk 18 |
నా రెండో సంతకం దానిపైనే.. చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ న్యూస్, హనుమాన్ జంక్షన్: అధికారంలోకి రాగానే రెండో సంతకంతో జలగన్న పట్టాదారు పాసు పుస్తకాలను రద్దుచేసి ప్రజల ఆస్తులను కాపాడుతామని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణాజిల్లా గన్నవరంలో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభకు ఆయన హాజరై ప్రసంగించారు. జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, నాయకులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సభకు తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ తాడేపల్లి లో ఒక సైకో ఉంటే గన్నవరంలో పిల్ల సైకో ఉన్నాడని వారిద్దరిని రానున్న ఎన్నికల్లో సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన వల్లభనేని వంశీ ఇప్పటివరకు నా మర్యాదనే చూశారని రానున్న రోజుల్లో రాజకీయ రౌడీలను ఎలా తుంగలో తొక్కేస్తామో చూస్తారని హెచ్చరించారు. గన్నవరం లో ఉన్న సైకో రౌడీయిజం, భూకబ్జాలు చేసి డబ్బులు సంపాదించారని, పోలవరం కాలువను తాను రైతుల ప్రయోజనాల కోసం తవ్వితే పిల్ల సైకో అనకొండలు మింగినట్టు మట్టిని మింగేసారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిందని ఆ నవ మోసాలకు విరుగుడే టీడీపీ 6 గ్యారంటీలు అని చెప్పారు. గన్నవరం టీడీపీ పార్టీ కంచుకోట అని 9 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు టీడీపీ నే గెలిచిందని అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. టీడీపీ ఆఫీసు తగలబెట్టి నాయకులను, కార్యకర్తలను జైల్లో పెట్టి హింస పెట్టిన పార్టీ శ్రేణులు పిల్ల సైకోకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఆపలేదని వారి పోరాటం అభినందనీయమన్నారు.

అధికారంలోకి రాగానే అన్ని పథకాలను అర్హులైన వారికి పారదర్శకంగా అమలు చేస్తామని, మహిళలను ఆదుకునే పార్టీ టీడీపీనేని స్పష్టం చేశారు. జగన్ పాలనలో అన్ని ధరలు విపరీతంగా పెరిగాయని, ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టిన జగన్ ఎన్నికల తర్వాత ప్రజలపై పిడిగుద్దులు గుద్దుతున్నరన్నారు. సాక్షి పత్రికలో గుమస్తాగా పని చేసిన సజ్జల ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉండి పనికిమాలిన సలహాలు ఇస్తున్నారని, ప్రజలు ఆస్తులు కొట్టేయాలని దుర్బుద్ధితోనే వైసీపీ సర్కార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలకు సిద్ధమైందన్నారు. ప్రజల ఆస్తులను క్రయవిక్రయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభుత్వాధికారులు కాకుండా ప్రైవేటు వ్యక్తులను రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా నియమించడంపై జగన్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించు కోకపోయిన, వైసీపీకి ఓటు వేసిన ఇంటికి గొడ్డలి వస్తుందని, ప్రజల ప్రాణాలకు ఊరే శరణ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగులు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఇప్పటికే బుద్ధి చెప్పారని,13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ పార్టీని తరిమికొట్టాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఇద్దరు గెలవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ ఓటింగ్ జరగకుండా పార్టీ శ్రేణులు జాగ్రత్త వహించాలన్నారు. సైకోను శాశ్వతంగా భూస్థాపితం చేసి వెంకట్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నన్ను, పవన్ కళ్యాణ్ ను తిట్టాలని బాలశౌరికి సైకో పార్టీ అధినేత చెప్పిన మమ్మల్ని తిట్టడం బాలశౌరికి ఇష్టం లేక ఎంపీ సీటు వదులుకొని జనసేనలో చేరారు. ఉమ్మడి కూటమి ఏర్పాటు సమయంలో పొత్తుల వలన చాలామంది నాయకులు త్యాగం చేయవలసి వచ్చిందని వారి సేవలను గుర్తించి రానున్న ప్రభుత్వంలో వారికి సముచితమైన స్థానం కల్పించే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed