చైనా ప్రొడక్ట్స్‌పై భారతీయుల్లో సందిగ్ధత!

by  |
చైనా ప్రొడక్ట్స్‌పై భారతీయుల్లో సందిగ్ధత!
X

భారత్ – చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదాలు కొత్తేం కాదు, అలాగని భారత్‌లో చైనా ఉత్పత్తుల మార్కెట్ కూడా తక్కువేం కాదు. ఓ వైపు దేశభక్తి, మరోవైపు ఆర్థిక తృప్తి మధ్య ప్రస్తుతం భారతీయులు మదనపడుతున్నారు. తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు అందించే చైనా వస్తువులు కొనాలా? లేదా దేశభక్తి చాటుకునే క్రమంలో చైనా వస్తువులను బహిష్కరించాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. మొన్నటికి మొన్న సరిహద్దులో భారత సైనికులను చైనా వారు పొట్టనబెట్టుకున్నారని తెలిసి చైనా వస్తువులు అమ్మే షాపుల మీద రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. ఇంకొందరు తాము చైనా యాప్‌లను వాడబోయేది లేదని వారి ఫోన్లలో ఉన్న యాప్‌లను తీసేశారు. ఇంకా కొందరైతే ఏకంగా తమ చైనా ఫోన్లను, టీవీలను పగలగొడుతూ వీడియోలు తీసి పోస్టులు చేశారు.

ఇదంతా నాణేనికి ఒకవైపే.. మరో కోణాన్ని పరిశీలిస్తే, జూన్ 18న ‘వన్‌ప్లస్ 8 ప్రో’ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో విడుదలైంది. కాగా విడుదలైన నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది. చైనా మీద కోపంతో ఉన్న వస్తువులను పగలగొట్టి అప్పటికే ఆ వస్తువుకు చెల్లించిన డబ్బును వృథా చేసుకోవడాన్ని బట్టి తెలివి తక్కువ పని అనుకోవాలో లేదా కొత్త ఫోన్ తక్కువకు వస్తుందని నిమిషాల్లో కొనేయడం తెలివైన పని అనుకోవాలో విశ్లేషకులకు అర్థం కాట్లేదు. చైనా ఉత్పత్తులను నిషేధించాలని ‘సోనమ్ వాంగ్‌చుక్’ పిలుపు మేరకు సెలబ్రిటీలు, ప్రముఖులు దాన్ని ప్రచారం చేస్తున్నారు. అదే ఆసరాగా చేసుకుని చైనా తెలియకుండా మనం దేశం చుట్టూ ఉన్న దేశాలను బుట్టలో వేసుకుని ఆర్థికంగా, మిలటరీ పరంగా ఎలా ఆధిపత్యాన్ని సాధించాలనుకుంటుందో తెలియజేసే వీడియోలు కూడా వచ్చాయి. ఆ వీడియోలను అర్థం చేసుకుని చైనా వస్తువులను పగులగొట్టి కట్టిన డబ్బును నష్టపోవడం, మళ్లీ కొత్త చైనా ఫోన్ నిమిషాల్లో కొనడం ఏంటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అయితే అందరూ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికే కొన్న వస్తువులను నాశనం చేసుకొని, డబ్బు నష్టపోవడం కాదు, ఇక నుంచి చైనా ఉత్పత్తులను కొనకుండా నియంత్రణలో ఉండాలని తెలుసుకోవాలి.

అయితే భారతీయుల మధ్యతరగతి మనస్తత్వం వల్ల తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండే ఫోన్లు కొనడానికే మొగ్గు చూపుతారు. ఈ కారణం వల్లనే షావోమీ, వీవో, శాంసంగ్, రియల్‌మీ, ఒప్పో వంటి బ్రాండ్లకు ఇక్కడ మంచి పేరు ఉంది. ఇక యాప్‌ల విషయానికి వస్తే, టిక్ టాక్ వంటి చైనా యాప్‌లకు భారతీయుల్లో మంచి క్రేజ్ ఉంది. చైనా మీది కోపంతో చాలా మంది ఆ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయడమే కాకుండా గూగుల్ ప్లే స్టోర్‌లో రివ్యూ తగ్గించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ నెమ్మదిగా ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఇలా ప్రతి చైనా ఉత్పత్తిని ముందు కోపంతో వద్దనుకున్నా తర్వాత కాసేపటికి వాటికి జేజేలు కొడుతుండటాన్ని బట్టి చూస్తే భారతీయులు నిజంగానే సందిగ్ధంలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.

Next Story

Most Viewed