ఓరుగల్లు గులాబీలో గ్రూపులు

by  |
ఓరుగల్లు గులాబీలో గ్రూపులు
X

దిశ, వరంగల్: అధికార పార్టీ టీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలు తెరమీదకొస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ పార్టీలో వర్గపోరు మొదలైంది. నేతల ఆధిపత్య పోరులో ఆది నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరకాల, భూపాలపల్లి, డోర్నకల్ నియోజకవర్గాల్లో మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చర్చ సాగుతున్నది. డీసీసీబీ చైర్మన్ ఎన్నిక విషయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య విభేదాలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నాలుగు రోజుల కిందట మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం తెలిసిందే. డోర్నకల్ నియోజకవర్గంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ మధ్య ఘర్షణ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి మధ్య లొల్లి బహిర్గతమైందని కార్యకర్తలు చెబుతున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టి.రాజయ్య, నేత కడియం శ్రీహరి మధ్య మనస్పర్థలూ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గులాబీ గూటిలో విభేదాలు సమసిపోయేలా చర్యలు తీసుకుని అందరూ కలిసి ఐకమత్యంతో పని చేసేలా గులాబీ అధిష్టానం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి..

టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు గానూ పదింటిని టీఆర్ఎస్ గెలుచుకుంది. భూపాలపల్లి, ములుగు స్థానాలను మాత్రమే కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల‌ నేపథ్యంలో భూపాలపల్లి నుంచి గెలుపొందిన గండ్ర వెంకటరమణారెడ్డి పింక్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఓటమి చెందిన రవిచంద్ర సైతం గులాబీ గూటికి చేరారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

సీఎం కేసీఆర్ మంత్రివర్గ కూర్పులో భాగంగా జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించారు. పాలకుర్తి నుంచి గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రి పదవి వరించింది. దీంతో ఆయన ఉమ్మడి జిల్లా‌పై తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో జిల్లాలోని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇది కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా పరిగణించింది. ఆ‌ తర్వాత కొంత కాలానికి ఎమ్మెల్సీ కోటా నుంచి డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన సత్యవతి రాథోడ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.‌ దీంతో అప్పటి వరకు జిల్లాలో ఒకే ఒక్కడిగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి ప్రాతినిధ్యం కాస్తాంత తగ్గినట్లయింది.

కొద్దిరోజుల కిందట జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల‌ సందర్భంగా టికెట్ల కేటాయింపు విషయంలో మంత్రి ఎర్రబెల్లికి పలువురు ఎమ్మెల్యేల మధ్య అంతర్యుద్ధం జరిగింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మంత్రి మాటను లక్ష్య‌పెట్టలేదని‌ తెలిసింది. ఈ పంచాయితీ అధిష్టానం దగ్గరికి చేరినట్టు ప్రచారంలో ఉంది. ఒకదశలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకున్నప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు పార్టీ శ్రేణులు బాహాటంగా చర్చించిన సందర్భాలు లేక పోలేదు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లని ఎంకరేజ్ చేస్తూ మిగతా వారిని తొక్కేస్తున్నాడనే ప్రచారం ‌జరుగుతోంది. పార్టీకి సంబంధించిన ‌పదవులు, నామినేటెడ్‌ పోస్టుల కేటాయింపులో తన సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపీట వేస్తున్నాడని బాధితులు బహిరంగ ఆరోపణలకు దిగుతున్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక సంస్థల టికెట్ల కేటాయింపు విషయంలో స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీ హరి మధ్య సైతం మనస్ఫర్థలు చోటు చేసుకున్నాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న వైరం కారణంగా ఇటీవల సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో రాజయ్య వర్గీయులు కడియం శ్రీ హరి తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు.

డోర్నకల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ వర్గీయులు రెండు‌గా చీలిపోయి సహకార ఎన్నికల్లో పోటీకి దిగారు. మంత్రి సొంత గ్రామం గుండ్రాతి మడుగులోనే ఆమె అనుచరులు ఓటమి చెందారు. ఇది రెండు వర్గీయుల మధ్య మరింత దూరాన్ని ఇంకా పెంచినట్టయింది.

నాలుగు రోజుల కిందట మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య కొంతకాలం‌గా నడుస్తున్న వైరం కాస్తా బట్టబయలైంది. స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఇరిగేషన్ సమావేశం ఏ విధంగా నిర్వహిస్తారని మంత్రి‌పై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి గులాబీ దళంలో చేరిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారనీ, ఉద్యమ కాలం నుంచి పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, పదవులు ఇవ్వడం లేదని పలువురు నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

Next Story

Most Viewed