అవును.. పీపీఈ కిట్ల కొరత ఉంది: బుగ్గన

by  |
అవును.. పీపీఈ కిట్ల కొరత ఉంది: బుగ్గన
X

ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనా పీపీఈ కిట్ల కొరత ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. పీపీఈ కిట్ల కొరత ఉందని, వైద్యులకు ఎన్ 95 మాస్కులు కూడా అందజేయకుండా వైద్య మందించమంటున్నరంటూ ఒక వైద్యుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీపీఈ కిట్ల కొరతపై బుగ్గన స్పందించారు.

కరోనా వైరస్‌పై పోరాటంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు పీపీఈ కిట్లు అందజేయాలని ప్రతి ప్రభుత్వంపైనా ఒత్తిడి ఉందని ఆయన అన్నారు. అయితే వాటిని సమకూర్చుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. పీపీఈ కిట్ల కొరత ఉన్నప్పటికీ తమ వద్ద ఉన్నంతవరకు అందిస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికా వంటి దేశాల్లోనే డాక్టర్లందరికీ పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయన గుర్తుచేశారు.

కరోనాపై పోరుకు తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని, వైద్య పరికరాల కొనుగోలుకు సీఎం జగన్ వెనుకడుగు వేయడం లేదని స్పష్టం చేశారు. విపక్షాలు ప్రతిదానికి విమర్శిస్తుండడం సరికాదని హితవు పలికారు. ఏపీలో తొలుత తక్కువ కేసులే నమోదైనా, ఓ సంఘటన కారణంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిందని వివరించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో కరోనా నిర్ధారణ కేంద్రాలను 4 నుంచి 7కి పెంచామని ఆయన గుర్తు చేశారు.

Tags: buggana rajendranath reddy, finance minister, ysrcp, ap, corona equipment

Next Story

Most Viewed