‘అద‌న‌పు బ‌కెట్‌’తో అడ్డగోలు దోపిడీ.. రూ. కోట్లలో ప్రభుత్వ ఖజానాకు గండి

by  |
‘అద‌న‌పు బ‌కెట్‌’తో అడ్డగోలు దోపిడీ.. రూ. కోట్లలో ప్రభుత్వ ఖజానాకు గండి
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఇసుక క్వారీల నుంచి అద‌న‌పు బ‌కెట్ దందా య‌థేచ్ఛగా సాగుతోంది. భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హ‌దేవ్‌పూర్ మండ‌లంలో నిర్వహిస్తున్న క్వారీల‌పై ఉన్నతాధికారుల ప‌ర్యవేక్షణ కొర‌వ‌డుతోంది. దీంతో క్షేత్రస్థాయి అధికారులు ఇసుక త‌వ్వకాలకు ఇష్టానుసారంగా ప‌ర్మిష‌న్స్ ఇస్తూ అక్రమాలు క‌నిపించకుండా క‌ళ్లు మూసుకుంటున్నారు. అధికారులు-ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు ఒక్కట‌వడంతో అద‌న‌పు బ‌కెట్ దందా బాజాప్తుగా సాగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిప‌డుతోంది. దీని గురించి అధికారులందరికీ తెలిసినా మామూళ్లకు ఆశపడి పెద్దగా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, పోలీస్,రవాణాశాఖ అధికారులు ఇసుక దందాపై ఉదాసీన వైఖరి ప్రదర్శించడంతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతోంది.

అద‌నంగా 3 ట‌న్నుల దోపిడీ..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి లారీలో 15 టన్నుల ఇసుక మాత్రమే లోడ్ చేయాలి. కానీ కాంట్రాక్టర్లు లారీ య‌జ‌మానుల ద‌గ్గర నుంచి రూ.2వేలు తీసుకుంటూ అద‌నపు బ‌కెట్‌తో నింపుతున్నారు. దీంతో ఒక్కో లారీలో 18 టన్నుల ఇసుక త‌ర‌లిపోతోంది. వాస్తవానికి ఈ అద‌న‌పు బ‌కెట్ దందాను అరిక‌ట్టాల్సిన అధికారులు చూసిచూడ‌న‌ట్లుగా ఉన్నారు. ఒక్కో క్వారీ నుంచి రోజూ 50 నుంచి 100 లారీల వ‌ర‌కు ఇసుక తరలుతుంది. స‌గ‌టున 50 లారీల ఇసుక ర‌వాణాను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నా.. ఒక్కో క్వారీ నుంచి రూ.ల‌క్ష ఆదాయాన్ని కాంట్రాక్టర్లు దండుకుంటున్నారు. ఇలా కాంట్రాక్టర్లు పొందిన ఆదాయంలో అధికారుల‌కు వాటాలు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మ‌హ‌దేవ్‌పూర్‌లో 28 క్వారీలుండ‌గా.. 20వ‌ర‌కు ర‌న్నింగ్‌లో ఉన్నాయి. అద‌న‌పు బ‌కెట్ కారణంగా దాదాపు రూ. 20 ల‌క్షల ప్రభుత్వ ఆదాయం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నది.

కాంటాల్లోనూ మోసం..

లారీల్లో అదనపు బకెట్ ఇసుక నింపిన అనంతరం వే బ్రిడ్జి వద్ద కూడా మోసం జరుగుతోంది. ఇసుక లారీల బ‌రువు ఎంత ఉన్నా ఫిక్స్‌డ్ ఫార్మెట్‌లో 43 ట‌న్నుల‌కే ర‌శీదులు అంద‌జేస్తున్నారు. సాధార‌ణంగా లారీ బ‌రువు 28 నుంచి 30 ట‌న్నుల్లోపుగా ఉంటుంది. అద‌న‌పు బ‌కెట్ దోపిడీ కార‌ణంగా 18 ట‌న్నుల ఇసుక లారీలో తీసుకెళ్తున్నారు. అప్పుడు లారీల వెయిట్ 46 నుంచి 48 ట‌న్నుల వరకు ఉంటుంది. అయితే, వే బ్రిడ్జి నిర్వాహకులు మాత్రం ఫిక్స్‌డ్‌గా 43 ట‌న్నులకే ర‌శీదు ఇస్తున్నారు. మహదేవ్ పూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఏ అధికారి వే బిల్లు తనిఖీ చేసినా అందులో మాత్రం లారీ పరిమితికి తక్కువగా ఉండటంతో అధికారులెవరూ చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇసుక క్వారీల కాంట్రాక్టర్లకు చెందిన వారే ఈ వే బ్రిడ్జిలు సైతం నిర్వహిస్తున్నట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. అందుకే ఈ వ్యవహారం బయటకు పొక్కడం లేద‌ని సమాచారం. వీరికి లారీల సంఖ్యకు అనుగుణంగా కొంత‌ మొత్తం అంద‌జేస్తుండ‌ట‌మే వీరి అక్రమాల‌కు కార‌ణ‌మ‌ని తెలిసింది. కొన్ని సందర్భాలలో ఇసుకకు వే బిల్లు లేకుండానే, డీడీలు తీయకుండానే వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

అధికారుల పర్యవేక్షణ కరువు..

భూపాల్ పల్లి జిల్లాలోని మహదేవ్పూర్ మండలంలో నరసన్న ఇసుక క్వారీల పై అధికారుల పర్యవేక్షణ కరువైంది. గతేడాది కిందట అప్పటి కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికీ పర్యవేక్షించాలని నాడు అధికారులను ఆదేశించారు. ఒక రెండు నెలల మాత్రం ఇసుక అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయింది. కలెక్టర్‌ అబ్దుల్ అజీమ్ బదిలీ కావడంతో మళ్లీ ఇసుక అక్రమ రవాణా దందా మొదలైంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం 24 క్వారీలను ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 20కి పైగా క్వారీలు నిత్యం నడుస్తూనే ఉన్నాయి. క్వారీకి నిత్యం 50 నుంచి 100 వరకు లారీలు ఇసుకను వరంగల్, హైదరాబాద్ పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వానికి ఇసుక వ్యాపారం ద్వారా నెలకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ, జరుగుతున్న అక్రమాలపై ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తు్న్నారు. ఇసుక క్వారీలపై అధికారుల నిఘా పెట్టి పర్యవేక్షణ చేస్తే ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

Next Story

Most Viewed