ప్రజలు మెచ్చితేనే ప్రత్యామ్నాయం

by Dishaweb |
ప్రజలు మెచ్చితేనే ప్రత్యామ్నాయం
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో నిబద్దత, విలువలతో కూడిన రాజకీయాలలో భారతదేశానికే అదర్శంగా వుండేది. ప్రస్తుతం రాష్ట్రంలో అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్తితులు నెలకొని ఉండడం శోచనీయం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌లు తమ యాత్రలలో అనుసరిస్తున్న అసంబద్ద వైఖరే దీనికి ప్రధాన కారణం. యాత్రల ద్వారా ప్రజలలోకి వెళ్ళే నేతలు ప్రజలతో మమేకమయ్యి వారి సమస్యలు తెలుసుకుంటూ నేనున్నాను అంటూ ప్రజలలో భరోసా కల్పించాల్సి ఉంటుంది. అదేసమయంలో తమలోని లోపాలను అధిగమించి తమకు తానుగా బలమైన ప్రజా నేతలుగా మలచుకునేందుకు రాజకీయ నాయకులు యాత్రలను ఉపయోగించుకుంటారు. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ యువనేత నారాలోకేష్, వారాహి పేరుతో జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్న యాత్రలు అందుకు పూర్తి విరుద్దంగా గతి తప్పడం చర్చనీయాంశం. వారిరువురిలో నారాలోకేష్ నడక ద్వారా , పవన్ కళ్యాణ్ వాహనం ద్వారా పరస్పర విరుద్ద యాత్రలు చేస్తున్నా ఆ యాత్రలలో వారు ఇరువురు అనుసరిస్తున్న వైఖరి, చేస్తున్న ప్రసంగాలు దాదాపు ఒకటేగా ఉండడం గమనార్హం.

పోరాటం లేని ఆరాటం ప్రదర్శన

యాత్రల సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తమ ప్రసంగాలతో ప్రజలకు భరోసా కల్పించవలసిన నారాలోకేష్, పవన్ కళ్యాణ్‌లు ప్రజలలో గందరగోళం సృష్టించడం ఆశ్చర్యకరం. ఇది ప్రజలలోనే కాదు వారి కార్యకర్తలనూ గందరగోళానికి గురిచేస్తోంది. పలుమార్లు ప్రజల మధ్య వారు మాట్లాడే మాటలతో స్వయానా వారూ అభాసుపాలు అవుతున్నారనేది నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతమున్న నేతలలో అసంఖ్యాకమైన ప్రజాబలం ఉన్ననేతగా ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ఎదిగారనేది జగమెరిగిన సత్యం. జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుచూపు మేరలో ఎవరూ లేరని కచ్చితంగా చెప్పవచ్చు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా చరమాంక దశలో ఉన్నారు. దానితో జగన్ మోహన్ రెడ్డికి తానే ప్రత్యామ్నాయ నాయకుడు అని ప్రజలలో రుజువు చేసుకునేందుకు నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు పోరాటం లేని ఆరాటం ప్రదర్శిస్తూ ప్రజలలో మరింత చులకన అవుతుండడం గమనార్హం.

నారాలోకేష్ జనవరి 27వ తేదీన కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో నారా లోకేష్ సాగనిస్తే పాదయాత్ర –అడ్డుకుంటే దండయాత్ర అనే ప్రాసతో కూడిన వ్యాఖ్య చేశారు. ఇప్పటి వరకు నారాలోకేష్ 200 రోజులుగా సుమారు 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సాగనిస్తే పాదయాత్ర – అడ్డుకుంటే దండయాత్ర అనే వ్యాఖ్యను నారాలోకేష్ ఇంకా ఉచ్చరిస్తుండడం హాస్యాస్పదం. అదేవిధంగా వారాహి యాత్ర ప్రారంభం నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రోడ్లలో తిరుగుతా-నన్ను ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ ప్రతి సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ ఉండడం పూర్తి హాస్యాస్పదంగా భావింపవచ్చు. తమను తాము గొప్ప నేతలుగా చిత్రీకరించుకోవడంలో భాగంగానే నారాలోకేష్, పవన్ కళ్యాణ్‌లు అటువంటి బలమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.

అర్ధం లేని ఛాలెంజ్‌లు విసిరితే చాలా?

నారాలోకేష్ పాదయాత్ర మొదలు పెట్టిన కుప్పం నుండి అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్న వై.యస్.ఆర్.సి.పి శాసనసభ్యుడు లేదా అక్కడ ఉన్న ఇంచార్జీ పైన, ఆ జిల్లాలో ఉన్న అగ్ర నేతలపై ఒక ప్రణాళిక ప్రకారం నిరాధార ఆరోపణలు చేస్తూ పోతున్నారు. అదేసమయంలో తాను పాల్గొన్న ప్రతి సభలో స్థాయిని మరచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్ అర్ధం లేని ఛాలెంజ్‌లు విసురుతూ ఉంటారు. జగన్‌కు తానే సమ ఉజ్జీ నాయకునిగా చూపించుకునేందుకే లోకేష్ ఈ విధమైన ప్రజామోదం కాని వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్వయానా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకోవడం ఆశ్చర్యకరం. అదేవిధంగా లోకేష్‌ను మించి రెట్టింపు స్థాయిలో జనసేనాని పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై, ఏపీప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తూ తీవ్రమైన అపఖ్యాతి మూటగట్టుకోవడం గమనార్హం. కాకినాడ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టు సాధించేందుకు జనసేనాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి స్థానం ఆశించే స్థాయిలో ఉన్న ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పవన కళ్యాణ్ ఒక నియోజక వర్గానికే పరిమితమైన శాసనసభ్యులు ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డిపై అంత తీవ్ర స్థాయిలో స్పందించడం పవన్ కళ్యాణ్ లోని నాయకత్వ డొల్లతనం తేటతెల్లం చేసింది.

వలంటీర్లపై అపరిపక్వ విమర్శలు

అదేవిధంగా జనసేనానిని ఇటీవల వాలంటరీ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అమానుషం. వాలంటరీ వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్‌లో గత మూడున్నర సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, రక్తసంబంధీకులు మనిషి దగ్గరకు పోలేని కరోనా కష్ట కాలంలో వాలంటీర్లు రాష్ట్ర ప్రజలకు చేసిన సేవను విస్మరించి పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై విమర్శలు చేయడం పవన్ రాజకీయ అపరిపక్వతను మరోమారు రుజువు చేసింది. 50 ఇండ్లకు కాదు 30 ఇండ్లకే ఒక వాలంటీర్‌ను తాము అధికారంలోకి వస్తే నియమిస్తామని, ఎప్పుడూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగే నారా చంద్రబాబునాయుడు ఇటీవల ఒక సభలో ప్రజలకు హామీ ఇవ్వడం పరిశీలిస్తే వాలంటరీ వ్యవస్థ ప్రాముఖ్యత సామాన్య మానవునికి సైతం అర్ధమవుతుంది.

జగన్ మోహన్ రెడ్డికి ఆషామాషీగా ముఖ్యమంత్రి స్థానం లభించలేదు. అదేవిధంగా జగన్‌కు లభించిన అశేష జనాదరణ వెనుక ఉన్న ప్రణాళిక, కృషి అజరామరం. సోనియాగాంధీ,చంద్రబాబు నాయుడు లాంటి శక్తివంతులైన రాజకీయ నాయకులతో పాటూ అనేక ఆటుపోట్లు తట్టుకుని జగన్ ఈ స్థాయికి చేరానడంలో ఎటువంటి సందేహం లేదు. మాటలు లేకుండా చేతల ద్వారా కార్యాన్ని సాధించుకోవడం జగన్ మోహన్ రెడ్డి విజయాల వెనుక ఉన్న మరో గొప్ప లక్షణం. కనుక ఇప్పటికైనా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే మాటలు మాట్లాడి రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నెలకొల్పినంతమాత్రాన జగన్‌కు ప్రత్యామ్నాయ నాయకత్వ ముద్ర రాదు అనే విషయం నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గ్రహించాల్సి ఉంది. అదేసమయంలో కేవలం సంచలనమైన మాటలను ప్రక్కన పెట్టి ప్రజలకు అవసరమైన, ప్రజలు మెచ్చే పోరాటాలు, కార్యాలు ప్రణాళికా బద్దంగా చేసినప్పుడే అధికారం అయినా, జగన్‌కు ప్రత్యామ్నాయ నాయకత్వ ముద్ర అయినా లభిస్తుందనే సత్యాన్ని నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి :: బాబు స్కెచ్ ఏంటి! టీడీపీ ముందు ఉన్న రెండు ఛాయిస్‌లు ఇవేనా!


కైలసాని శివప్రసాద్

సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్

హైదరాబాద్

మొబైల్.. 94402 02999

Next Story

Most Viewed