కశ్మీర్‌లో కేంద్రం పాచిక పారేనా?

by  |
కశ్మీర్‌లో కేంద్రం పాచిక పారేనా?
X

శ్రీనగర్: మనదేశంలో జమ్ము కశ్మీర్ విభిన్నమైన జనసమూహాలు గల రాష్ట్రంగా ఉండేది. 2019 ఆగస్టు 5న కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి, 370 అధికరణాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునేవరకు ఇది ముస్లిం మెజార్టీ రాష్ట్రం. దీన్ని వేర్పాటువాదులు సహా ప్రధానస్రవంతి రాజకీయపార్టీలు, సగటు కశ్మీరీ విభేదించారు. ముందస్తు సమాచారమైనా లేకుండా తమ హక్కులను, జీవితాలపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మాజీ సీఎంలు సహా నేతలు, కార్యకర్తలు నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. ఈ నిర్ణయానికి రెండేళ్లు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కశ్మీరీ పార్టీల నేతలతో ప్రధానమంత్రి మోడీ రేపు సమావేశం కానున్నారు. ఇప్పటికీ అజెండా వెల్లడికాని ఈ భేటీకి నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ సహా ఇతరపార్టీల నేతలు హాజరవుతున్నారు. దీర్ఘకాలం ఆంక్షల నడుమ కాలం వెళ్లదీసిన జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు కల్పించడానికి కేంద్రం సంకల్పించినట్టు తెలుస్తున్నది. ఎన్నికలు నిర్వహించీ తన పట్టును నిలుపుకోవాలనే ఎత్తుగడా ఇందులో ఉన్నట్టు విశ్లేషణలున్నాయి. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు గళం వినిపించడానికి రెండేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తున్న స్థానిక పార్టీలు ఈ సమావేశాన్నీ అవకాశం తీసుకోబోతున్నట్టు సమాచారం.

రాష్ట్ర హోదా వర్సెస్ ప్రత్యేక ప్రతిపత్తి

2019లోనే కేంద్ర ప్రభుత్వం లడాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగిస్తామని, జమ్ము కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రహోదా కల్పిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సహిత కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పించడం, ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో ఉంటుందని తెలుస్తున్నది. నవంబర్‌లో లేదా వచ్చే ఏడాది తొలి రెండు మూడు నెలల్లో ఈ ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే, కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను పునరుద్ధరించే లక్ష్యంతో గుప్కార్ అలయెన్స్‌గా ఏర్పడిన కశ్మీరీ స్థానిక పార్టీల నేతలు తమ డిమాండ్లను సమావేశంలో లేవనెత్తే అవకాశం ఉన్నది. ప్రధాని భేటీకి ముందు ‘గుప్కార్’ పార్టీలు బుధవారం సమావేశమయ్యాయి. అనంతరం, ప్రధానితో జరిగే సమావేశంలో తాము ప్రత్యేకప్రతిపత్తి పునరుద్ధరణకు డిమాండ్ చేస్తామని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాలతోపాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ జమ్ము కశ్మీర్ చీఫ్ జీఏ మిర్, పాంథర్స్ పార్టీ నేత భీమ్ సింగ్, జమ్ము కశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి కవిందర్ గుప్తా, బీజేపీ నేత రవీందర్ రైనా సహా పలువురు నేతలు పాల్గొంటారు.

మాకు ఇదో అవకాశం..

‘మొన్నటి వరకు నిర్బంధంలో ఉంచారు. ఇప్పుడు మాతోనే సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిపై వినిపించే అవకాశమే నిన్నటి వరకు లేకుండాపోయింది. ఇప్పుడు ప్రధాని నిర్వహించే ఈ భేటీనే తాము జాతీయ వేదికగా ఉపయోగించుకుంటాం. మా డిమాండ్లు వినిపిస్తాం’ అని ఓ పీడీపీ నేత అన్నారు. నిజానికి ఈ సమావేశంలో పెద్దగా వ్యతిరేకత వెల్లడవ్వకపోవచ్చని, ఎందుకంటే వేర్పాటువాదులు, విమర్శకులందరి నోళ్లనూ మూశారని మరో నేత చెప్పారు. ‘జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చూపెట్టడం వారి లక్ష్యం. అందుకే, రాష్ట్రహోదా, అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడతారు. ఎన్నికలు నిర్వహించి ఓ కశ్మీరీని సీఎం చేసి లెఫ్టినెంట్ గవర్నర్‌తో పరోక్షంగా న్యూఢిల్లీనే అధికారం చెలాయిస్తుంది’ అని వివరించారు. ఈ సమావేశం అజెండా ఏదైనా జమ్ము కశ్మీర్‌ కోసం మాట్లాడటం కశ్మీరీ నేతల బాధ్యత అని ఇంకో పీడీపీ నేత పేర్కొన్నారు.

Next Story

Most Viewed