Credit Chori : భూ సర్వే క్రెడిట్‌ చోరీ.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్

by Ramesh Naini |   (  Updated:2026-01-22 07:45:39  IST  )

భూముల రీ-సర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Credit Chori : భూ సర్వే క్రెడిట్‌ చోరీ.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భూముల రీ-సర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భూమండలం మీద క్రెడిట్‌ చోరీ చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని, ఆయన రంగులు మార్చే తీరును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లి ఘటనతో పాటు, రాష్ట్రంలో భూముల రీ-సర్వేపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాదయాత్ర సమయంలో రీ-సర్వే ఆలోచన

‘మేం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో కనీసం సర్వేయర్లు లేరు. బ్రిటీషర్ల కాలం నాటి రికార్డులే తప్ప, ఆధునిక సాంకేతికత ఊసే లేదు. పాదయాత్ర సమయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశాకే.. రీ-సర్వే ఆలోచన చేశాను. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే 2020 డిసెంబర్ 21న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయం’ అని జగన్ పేర్కొన్నారు.

టెక్నాలజీతో చెక్.. ట్యాంపరింగ్‌కు నో చాన్స్

గతంలో ఎన్నడూ లేని విధంగా యూరప్, అమెరికాలో ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే ఆఫ్ ఇండియాతో (2020 డిసెంబర్ 9న) ఒప్పందం కుదుర్చుకుని మరీ ఈ ప్రాజెక్టును చేపట్టామని జగన్ గుర్తు చేశారు. ‘భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేని విధంగా తీర్చిదిద్దాం. రైతుల చేతికి క్యూఆర్ (QR) కోడ్‌తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించాం. ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటూ శాశ్వత భూ హక్కు పత్రాలను జారీ చేశాం. గ్రామ సచివాలయాల్లోనే రికార్డులు అందుబాటులో ఉండేలా విప్లవాత్మక మార్పులు తెచ్చాం’ అని ఆయన వివరించారు.

నాలుగు సార్లు సీఎంగా ఉండి ఏం చేశారు?

నాలుగు సార్లు సీఎంగా ఉండి ఏం చేశారు? ముఖ్యమంత్రి పదవీ కాలంలో ఏనాడైనా రైతుల భూ సమస్యల గురించి ఆలోచించారా అని జగన్ ప్రశ్నించారు. ‘80 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుకు రైతుల సమస్యలు తీర్చాలన్న ఆలోచన ఏనాడూ రాలేదు. కేవలం భూములను 22-ఏ (నిషేధిత జాబితా)లో పెట్టడం మాత్రమే ఆయనకు తెలుసు. సవాలక్ష భూ సమస్యలకు ఏకైక పరిష్కార మార్గంగా మేము రీ-సర్వే చేపడితే.. ఇప్పుడు దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నారు’ అని జగన్ విమర్శించారు. సమగ్ర సర్వే విషయంలో తాము సృష్టించిన రికార్డులను ఎవరూ చెరిపివేయలేరని ఆయన స్పష్టం చేశారు.

Read More... హిట్లర్, తుగ్లక్, ముస్సోలినీ తరహాలో జగన్ ప్రవర్తన.. యనమల తీవ్ర విమర్శలు

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!

Next Story