నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-22 04:29:15  IST  )

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అధ్యక్షతన తాడపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొననున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఆ నాలుగు అంశాలపైనే కీలక చర్చ..

రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని జగన్ భావిస్తున్నారు. ఇది పేద విద్యార్థులకు. ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని, దీనిపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలను ఆదేశించనున్నారు. రాయలసీమ (Rayalaseema) ప్రాంతానికి జీవనాడి వంటి ఎత్తిపోతల పథకం పనుల నిలిపివేతను పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత, ప్రాజెక్టు అర్థాంతరంగా ఆపేయడం వల్ల కలిగే నష్టాలను పార్లమెంట్‌లో బలంగా వినిపించి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇతర హామీల అమలు కోసం పార్లమెంట్ ఉభయ సభల్లో రాజీలేని పోరాటం చేయాలని డిసైడ్ చేయనున్నారు. ఇక చివరగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతల అంశం, ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేలా చేయడమే లక్ష్యంగా ఇవాళ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది.

Read More..

ఒక్కసారికే తీరని నష్టం.. ఇప్పుడు మళ్లీనా: జగన్ పాదయాత్రపై మంత్రి రియాక్షన్

Next Story