ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను : సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-18 11:21:07  IST  )

ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రజలు సురక్షితంగా ఉండాలని తాను రాజీలేని పోరాటం చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన ఆయన నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు తాను అడ్డుగోడలా నిలిచానన్నారు. తనకు ప్రాణాపాయం ఉన్నా కూడా ఎన్నడూ ప్రజా సంక్షేమం విషయంలో వెనుకడుగు వేయలేదని తెలిపారు. రౌడీలు రోడ్డుపైకి వస్తే వారికి చోటు లేదని చెప్పింది టీడీపీ అని తెలియజేశారు. మతసామరస్యాన్ని కాపాడిన పార్టీ, మత విద్వేషాలను కంట్రోల్ చేసిన పార్టీ, కర్ఫ్యూ లేకుండా చేసిన పార్టీ టీడీపీ అని కుండబద్ధలు కొట్టారు.

శాంతిభద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు

రాష్ట్రంలో కొందరు పొలిటికల్ రౌడీలు తయారయ్యారని.. నేరస్తులే పార్టీలు నడుపుతున్నారని పేర్కొన్నారు. బాబాయిని చంపినంత ఈజీ కాదు రాష్ట్రంలో నేరాలు చేయడం అని పరోక్షంగా వైసీపీ నేతలకు సూచించారు.. రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపించేది సీబీఎన్ అని ప్రతిపక్ష నేత గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించనప్పుడే పెట్టుబడులు వస్తాయన్నారు. అప్పుడు స్వర్ణాంధ్ర 2047 సాకారమవుతుందన్నారు. 18 నెలల్లో రాష్ట్రం ఏమవుతోంద అని ఆలోచించిన అందరికీ చేతలతో సమాధానం చెప్పామన్నారు. సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల వారు సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు ఏపీకి వచ్చారన్నారు. తెలుగు ప్రజల్లో కూటమి ప్రభుత్వం కల్పించిన ఆత్మ విశ్వాసానికి అది నిదర్శనం అన్నారు.

అధికారం కోసం ఆరాట పడలేదు

పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలతో పాటు తాను కూడా ఎంతో ఇబ్బంది పడ్డానన్నారు. కక్ష సాధింపులకు రాజకీయాలను తాను రాలేదని, తెలుగు జాతిని కాపాడడానికి రాజకీయాల్లో వచ్చామని తెలిపారు. టీడీపీ పని అయిపోయిందన్న వారి పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టీడీపీ ఎప్పటికీ చెక్కు చెదరదని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ఎప్పుడూ అధికారం కోసం ఆరాట పడలేదన్నారు. ప్రజల సెంటిమెంట్లు తాను అర్థం చేసుకోగలను అన్నారు. పార్టీ నాయకులను, క్యాడర్ ను కూడా అర్థం చేసుకొని సరైన మార్గంలో నడిపినప్పుడే నాయకుడవుతాను అని పేర్కొన్నారు. మనం దేని కోసం పనిచేస్తున్నామో ఆ లక్ష్య సాధనలో కాంప్రమైజ్ కావొద్దన్నారు.

కార్యకర్తలు లేకుంటే నాయకులు లేరు

అనునిత్యం టీడీపీ నాయకులు, కార్యకర్తల త్యాగాలను తాను గుర్తించుకున్నానని పేర్కొన్నారు. కార్యకర్తలు లేకపోతే నాయకులు లేరు. గెలవడానికి పలుమార్లు బయట నుంచి కూడా నాయకులను తెచ్చుకుంటాం. వచ్చిన నాయకులు కూడా గుర్తంచుకోవాలి ఇది ఒకరోజు పార్టీ కాదని సూచించారు. దేశానికి దశ, దిశ నిర్దేశం చేసిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. శిక్షణ కార్యక్రమాలు పెట్టి మరీ సమర్థవంతమైన నాయకులను తయారు చేసుకున్నాం అన్నారు. టీడీపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలైన వదిలే త్యాగశీలురని కొనియాడారు.

వారి గౌరవం పెంచే బాధ్యత తీసుకున్నా

రాష్ట్రంలో ఎన్నో పార్టీలున్నాయని కానీ.. కార్యకర్తల సంక్షేమానికి పనిచేసిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్ పెట్టిన పార్టీ టీడీపీ అన్నారు. పార్టీ ఆఫీసు కార్యకర్తలకు కార్యాలయంలో గౌరవం దక్కాలని నిర్ణయించామన్నారు. రూ.5లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాం అన్నారు. కార్యకర్తల గౌరవాన్ని పెంచే బాధ్యత తాను తీసుకున్నా అన్నారు.

ఉద్యోగులకు సంక్రాంతి కానుక

గత ప్రభుత్వం ఉద్యోగులు బకాయిలు అడిగితే తప్పుడు కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం నిజమైన సంక్రాంతి కానుకలను ఉద్యోగులకు ఇచ్చిందన్నారు. దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు.

దేశాభివృద్ధి కోసం

దేశ అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అండగా ఉన్నామన్నారు. రూ.700ల కోట్లతో సర్వే రాళ్లపై ఫోటో వేసుకున్న దుర్మార్గులు రాష్ట్రంలో ఉన్నారని వైసీపీ అధినేతపై పరోక్ష విమర్శలు చేశారు.

READ MORE .....

అవన్నీ అబద్ధాలే: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

సీఎం చంద్రబాబు కోసం బండ్ల గణేశ్ పాదయాత్ర

Next Story